ఆచార్య సాయిబాబా నిరాహార దీక్ష ఉపసంహరించుకునేటట్లు చేయాలని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కన్వీనర్ కే. పద్మ విశాఖలో డిమాండ్ చేశారు. ఆయనకు మందులు, పుస్తకాలు, లేఖలు సజావుగా అందేటట్లు అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. క్రూరమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద నాగపూర్ కేంద్ర కారాగారంలో సాయిబాబా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఆయన 90% వైకల్యంతో ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించాలని ఆమె కోరారు. కుటుంబ సభ్యులు అందించిన మందులను కూడా ఆయనకు ఇవ్వడం లేదని, సహచరి రాసిన ఉత్తరాలను కూడా అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీల ప్రాథమిక హక్కుగా చదువుకోడానికి పుస్తకాలు, రాసుకునేందుకు వస్తువులు అందజేయాలని ఎప్పటినుంచో కోరినప్పటికి, నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
కరోనా వ్యాపించిన జైల్లో ప్రాణానికి ముప్పు ఉన్న ఆచార్యకు బెయిల్‌ను అనేకసార్లు తిరస్కరించారని పద్మ వాపోయారు. తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లేందుకు ఆచార్య సాయిబాబాకు అనుమతించలేదని ఆమె గుర్తు చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మీ, పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు టి.శ్రీరామ్మూర్తి, ఆల్ ఇండియా పీపుల్స్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధి కే.ఎస్.చలం పాల్గొన్నారు.
ఇదీ చూడండి: