మాజీ శాసనసభ్యుడు, వీఎంఆర్డీఏ మాజీ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు, విశాఖ ప్రజలు నివాళులర్పించారు. విశాఖ డాక్టర్స్ కాలనీలోని రాజీవ్ సదన్ వద్ద ప్రజా సందర్శనార్థం సోమవారం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు,ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజా, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు, సినీ దర్శకుడు కోన వెంకట్ , భాజపా నేతలు మాధవ్, విష్ణు కుమార్ రాజులు ద్రోణంరాజుకు నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా నేతలు... ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. అవినీతి మచ్చలేని మంచి నాయకుడిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుందని పలువురు బాధను వ్యక్తపరిచారు.
- రాజకీయాల్లో ఇలాంటి మనిషి మరొకరు ఉండరు. నిత్యం ప్రజలతో మమేకమై ద్రోణంరాజు శ్రీనివాసరావు జీవించారు- కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్
- విశాఖ ప్రజలు ద్రోణంరాజు శ్రీనివాస్ లేరన్న మాట జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ద్రోణంరాజుని అభిమానించేవారు. నియోజక వర్గంలో ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచే ఏకైక నాయకుడు ఆయన - వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్యే
- ద్రోణంరాజు మరణం అత్యంత విషాదకరం. ఎప్పుడూ పేద ప్రజల అభివృద్ధి కోసం ఆయన పని చేశారు. నీతి, నిజాయితీతో ద్రోణంరాజు రాజకీయం చేశారు- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి