ప్రశాంత విశాఖ.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఇంట్లో ఆరుహత్యలు.. వాళ్లలో ఇద్దరు చిన్నారులు. ఈ ఘటన చూసిన వారి మనసంతా చివుక్కుమంది. ఇళ్లంతా రక్తపుమడుగు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు. మెుదట ఆస్తితగాదాలే అనుకున్నారంతా.. కానీ లోతుగా వివరాలు ఆరా తీస్తే.. ఈ ఆరుహత్యలకు కారణం.. గతంలో జరిగిన అత్యాచారమే అని తెలుస్తోంది.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఓ కుటుంబం హాయిగా నిద్రపోతుంది. ఆదమరిచి నిద్రపోతున్న వేళ.. తెల్లవారుజామున.. ఉన్నపాటుగా కేకలు. పక్కన ఉన్నవారే అరుస్తున్నారు. చూస్తూ ఉండగానే.. ఇల్లంతా రక్తపు మడుగు. బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి... చిన్నపిల్లలు, ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఏకంగా ఆరుగురిని హత్య చేశాడు. బొమ్మిడి రమణ (63), బొమ్మిడి ఉషారాణి (35), అల్లు రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్ (2), బొమ్మిడి ఉర్విష (6 నెలలు) అంతా రక్తపు మడుగుల్లో పడి.. కొన ఊపిరితో కొట్టుకుంటూ ప్రాణాలు వదిలారు. ఒక్కసారిగా విషయం తెలిసిన జుత్తాడ గ్రామం ఉలిక్కిపడింది.
అయితే.. ఈ హత్యలు పాత కక్షల నేపథ్యంలో జరిగాయి అనుకున్నారంతా. నిందితుడు పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మెుదట విచారణ చేస్తుంటే.. అసలు విషయం తెలియలేదు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడే కాదు.. ఓ హత్యాయత్నం కేసులో 2012లోనూ నిందితుడిగా ఉన్నాడు అప్పలరాజు. 2018లోనూ పెందుర్తి పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైంది.
అసలు కారణం ఇదే..
నిందితుడు అప్పలరాజుకు.. ఓ కుమార్తె (20) ఉంది. ఆమెను బమ్మిడి విజయ్.. మత్తమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అలా ఎనిమిది నెలలు ఘోరానికి పాల్పడ్డాడు. ఈ విషయం విజయ్ భార్య ఉషారాణికి తెలిసినా.. ఫొటోలను చూపించి.. బాధితురాలినే బ్లాక్ మెయిల్ చేసేది. 2018లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పెందుర్తి స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అది విచారణలో ఉంది. ఆ కుటుంబం వలన తనకు అన్యాయం జరిగిందని అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. తన కుమార్తెకు జీవితం నాశనమైందనుకున్నాడు. ఎలాగైనా ఆ కుటుంబాన్ని అంతమెుందించాలని అనుకున్నాడు.
సమయం కోసం వేచి చూసి...
అయితే.. ఆ మరుసటి రోజు 2018 ఏప్రిల్ 10న తన భర్త (బమ్మిడి విజయ్)ను హతమారుస్తానని బత్తిన అప్పలరాజు, బత్తిన శ్రీను, బత్తిన గౌరీష్, బత్తిన సన్యాసి బెదిరించారని బమ్మిడి ఉషారాణి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇంకా.. కక్ష పెంచుకున్న బత్తిన అప్పలరాజు.. సమయం కోసం వేచి చూశాడు. ఇవాళ ఉదయం వేట కొడవలితో ఆరుగురిని హత్య చేశాడు. ఆ కుటుంబం వల్లే తన కుమార్తె జీవితం నాశనమైందని కోపంతో ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: