రెండు వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అప్పటికీ స్పందించకుంటే.. ఈసారి అమరావతిలో నడుస్తానని హెచ్చరించారు. విశాఖలోని పాత జైలురోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన జనసేన లాంగ్‌మార్చ్ సభలో వైకాపా ప్రభుత్వంపై పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇసుక సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాలు గడువిస్తున్నానని తెలిపారు. ఇప్పటికి 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని... వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన నడకను ఎవరు ఆపుతారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు మీద ఉన్న కోపం కార్మికులపై చూపొద్దని ప్రభుత్వానికి సూచించారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎవరైనా శుభాలతో పాలన మొదలుపెడతారని.. వైకాపా ప్రభుత్వం మాత్రం కూల్చివేతలతో మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. కూల్చివేతలను నమ్ముకునే ప్రభుత్వం వేగంగా కూలిపోతుందని వ్యాఖ్యానించారు.
త్వరలో దిల్లీకి వెళ్తా
అందరూ మర్చిపోయినా ప్రత్యేక హోదాను తాను వదిలేయలేదని జనసేన అధినేత స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష కోసం ప్రధానితో కూడా విభేదించానని వెల్లడించారు. వైకాపా నేతలు దిల్లీకి వెళ్లి భాజపా నేతల వద్ద ఎలా ఉంటారో, ఎవరితో ఏం మాట్లాడతారో కూడా తనకు తెలుసని పవన్ చెప్పారు. కానీ అవి సభలో చెప్పాలనుకోవటం లేదని అన్నారు. త్వరలో దిల్లీకి వెళ్లి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. భవిష్యత్ ప్రణాళికను రెండు వారాల తరువాత ప్రకటిస్తానని జనసేనాని తెలిపారు.