కాఫీ ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బందితో విశాఖ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం జరుగుతోంది. అంతలోనే ఓ ఉద్యోగి మొబైల్ రింగ్ అయింది. ఎవరా వ్యక్తి అంటూ దగ్గరికి పిలిపించుకుని సదరు ఉద్యోగిని హెచ్చరించారు సదరు ఆఫీసర్. సమావేశాలు జరుగుతున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం తెలియదా అంటూ మందలించారు. సమావేశాల్లో ఫోన్ రింగ్ అయితే సహించేది లేదని ఇప్పటికే 30 ఫోన్లు విసిరేశానని అధికారులకు హెచ్చరించారు. సమావేశాలు జరిగేటప్పుడు ఫోన్ స్విచాఫ్ చేసుకోవాలని అందరికీ సూచించారు.
సమావేశాల్లో ఫోన్ రింగ్ అయితే మీ ఫోన్లు పగిలిపోతాయంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలకృష్ణ. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పాడేరులో సుడిగాలి పర్యటనలతో అధికారులను, ఉద్యోగులను హడలెత్తిస్తున్నారు. నాడు-నేడు పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఇదే సమయంలో సమావేశాల్లో ఫోన్ల వాడకంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఇదీ చదవండి:
EAMCET: ఎంసెట్‌కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లు.. లింగనిష్పత్తిలో దేశంలో ఏపీది 16వ స్థానం!