విశాఖలో కరోనా పై సమీక్ష సమావేశం..
విశాఖ జిల్లాలో కరోనా నివారణ, మరణాల రేటు తగ్గించడం, వ్యాధిపై సామాజిక నిఘా కోసం చేపట్టిన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ వి. వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. కరోనా పై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కరోనా సోకే ప్రమాదం ఉన్న ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారికి చేస్తున్న పరీక్షలు రేపటితో పూర్తి చేయాలన్నారు. వృద్ధులు, బీపీ, షుగరు గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి పాజిటివ్ వారికి చికిత్స మొదలు పెట్టాలన్నారు. జిల్లాలో కరోనా వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం పై కరపత్రాలు, హోర్డింగ్స్, సమావేశాలు ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత పరిశుభ్రత, గురించి వివరించాలన్నారు.
అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా కదిరిలో వరుసగా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాధిని నివారణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమావేశమయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హాజరయ్యారు. కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను శాసనసభ్యుడు అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ మారుతి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమయిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలోని మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. బూర్జ, మందస కేసులను పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ప్రారంభం అయినట్లు స్పష్టం అవుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 417 కేసులు ఉండగా.. 126 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. రానున్న రెండు నెలలు కీలకం కావటంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిని క్వారంటైన్ కేంద్రాలతో పాటు కోవిడ్ కేర్ సెంటర్లో సేవలు చేసే విభాగంలో పెడతామని కలెక్టర్ హెచ్చరించారు.