శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల కోసం విమ్స్‌ను రాష్ట్ర స్థాయి కొవిడ్ ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా కేసుల తాకిడి అన్ని జిల్లాల్లో పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా నర్సింగ్ సేవలను పెంచేందుకు జిల్లాకు 139 స్టాఫ్ నర్సుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖతో సమానంగా ఇతర జిల్లాలకు పోస్టులు మంజూరు అయ్యాయి. ఆయా జిల్లాల్లో భర్తీ ప్రక్రియ ముగిసింది. జిల్లాలో మాత్రం ఇంత వరకు పూర్తి కాలేదు. ఆన్‌లైన్‌లో మొత్తం 2,100 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులన్నీ ఏడాది కాల వ్యవధితో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈనెల 3వ తేదీ నాటికి ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అభ్యర్థు.లు కొన్ని ధ్రువపత్రాలు జత చేయకపోవడంతో భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
2,100 మంది దరఖాస్తు
ఆన్‌లైన్‌లో మొత్తం 2,100 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులన్నీ ఏడాది కాల వ్యవధితో ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు 54 ఎనస్తీషియా టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేపట్టారు. వీటికి 110 మంది దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఈనెల 3వ తేదీ నాటికి ఆయా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అభ్యర్థులు కొన్ని ధ్రువపత్రాలు జత చేయకపోవడంతో భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. జేసీ-2 అరుణ్‌బాబు ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పలుసార్లు ఆయా జాబితాలను పరిశీలన చేసింది. భర్తీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
విమ్స్‌పై తీవ్ర ప్రభావం
నర్సింగ్ పోస్టులు భర్తీ కాకపోవడం.. విమ్స్ ఆసుపత్రిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 191 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికులు ఐసీయూలో ఉన్నారు. వారికి సేవలందించేందుకు షిఫ్టునకు 20 నుంచి 25 మంది నర్సులు అందుబాటులో ఉంటున్నారు. కనీసం షిఫ్టునకు 40 నుంచి 50 మంది ఉండాలి. కొత్త నియామక ప్రక్రియ కొలిక్కి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని విమ్స్ వర్గాలు జేసీ వేణుగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ విషయమై కేజీహెచ్ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ జి.అర్జునను వివరణ కోరగా, నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చిదని, రెండు మూడు రోజుల్లో అర్హుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. కొందరు అభ్యర్థులు తాము చదివిన కోర్సులకు సంబంధించి రెన్యువల్ సర్టిఫికెట్లను దరఖాస్తులతోపాటు జతపర్చలేదని, దీని వల్ల భర్తీ కొద్దిగా ఆలస్యమైందని చెప్పారు.
ఇదీ చదవండి: టోల్గేట్ వద్ద మాజీ ఎంపీ వీరంగం.. పోలీసులపై దాడి!