NTR Centenary Celebrations: ఆస్తులు సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి అప్పులు చేయవచ్చు గానీ, పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి, తాయిలాలు ఇవ్వడానికి అప్పులు చేయకూడదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్బోధించారు. శుక్రవారం విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాధికారత-సుపరిపాలన’పై ఎన్టీఆర్ స్మారకోపన్యాసం ఇచ్చారు. ‘అభివృద్ధికి అవరోధం కల్పించేలా ఉచితాలు ఇవ్వడం సమర్థనీయం కాదు. ఆ విధమైన చర్యలు సుపరిపాలన అనిపించుకోవు.
ప్రజలకు ఏమైనా ఉచితంగా ఇచ్చే ముందు.. అవి ఇవ్వడానికి ఆదాయ మార్గాలు ఉన్నాయా? లేవా? బడ్జెట్లో కేటాయింపులు చేసుకోగలమా? అన్నవి ఆలోచించుకోవాలి. అసెంబ్లీ ఆమోదం పొందాలి...’ అని సూచించారు. వివిధ పథకాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని గతంలో దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి బాధపడ్డారని చెబుతూ... ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అలా బాధపడే వ్యక్తి కాదని... రూపాయి వెచ్చిస్తే ఆ రూపాయి వంద శాతం ప్రజలకు చేరాలని కోరుకుంటారని, ఆ విధంగా చేరేలా చేసి చూపించారని కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడించారు. ఆయన ప్రధాని అయిన వెంటనే జన్‌ధన్ ఖాతాలను తెరిపించి ప్రభుత్వ పథకాల నిధులన్నీ వారి ఖాతాల్లో నేరుగా జమయ్యేలా చేస్తున్నారని పేర్కొన్నారు.
ఛాన్స్ దొరికితే ఎన్టీఆర్ సినిమాలే చూసేవాళ్లం
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తదితర దేవుళ్లను తలచుకుంటే తనకు ముందుగా ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఎన్టీఆర్ సినిమాలే చూసే వాళ్లమని గుర్తు చేసుకున్నారు. పురాణాల్లోని అంశాలను తెలుసుకోవాలనుకుంటే బంధువులు, కుటుంబసభ్యులతో ఎన్టీఆర్ సినిమాలు చూసి ఆనందించేవారమన్నారు. ‘రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ సరికొత్త ఒరవడి సృష్టించారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అంతటి విశ్వసనీయత ఆయనకు ప్రజల్లో ఉంది..’ అని చెప్పారు. ఆయన కుమార్తె పురందేశ్వరి, కుటుంబ సభ్యులందరి సహకారంతో తన తండ్రి జ్ఞాపకార్థం సంవత్సరం పాటు ప్రతి నెలా ఒకటి చొప్పున కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించడం, తండ్రి పట్ల అంతటి గౌరవాన్ని ప్రదర్శించడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువని గుర్తు చేశారు. ‘కాలే కడుపులకు అన్నం పెట్టకపోతే మనమెందుకు?’ అనే వారన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంశాల్లో సమతూకం పాటించాలన్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి మాట్లాడుతూ ‘సంక్షేమం.. సుపరిపాలన’కు తన తండ్రి అర్థం చెప్పారన్నారు. రూ.2కే కిలో బియ్యం పథకం, పక్కా గృహాలు, మహిళా సాధికారత, మహిళలకు ఆస్తిలో హక్కు, మహిళా ప్రాంగణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్, పట్వారీ వ్యవస్థల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలెన్నో తన తండ్రి తీసుకున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ డీన్ మదన్ పిల్లుట్ల, గీతం విశ్వవిద్యాలయ ఛైర్మన్ ఎం.శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న గురుదేవా ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ రాపర్తి జగదీశ్‌కుమార్, డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ, భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ శ్రీరామ్‌లను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఘనంగా సన్మానించారు. విశాఖ అభివృద్ధి మండలి వ్యవస్థాపకుడు ఒ.నరేశ్‌కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇవీ చదవండి:
టికెట్ చార్జీలు పెంచిన ప్రభుత్వానికి.. ప్రయాణికుల భద్రత పట్టదా: చంద్రబాబు
'కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి'.. ఆర్జేడీ కొత్త డిమాండ్
ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నాలేంటి?