Women Scientists Social Service In Visakha : రక్షణ రంగ పరిశోధనాశాలలో శాస్త్రవేత్తలుగానే కాకుండా సమాజానికి తమవంతు కృషి చేస్తున్నారు ఈ మహిళామణులు. 'మహిళా కళ్యాణ్ మంచ్' పేరిట వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా సమాజ వికాస కార్యక్రమాలను విరివిగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకుందే తడవుగా నిర్దేశిత లక్ష్యం వైపు పయనిస్తూ.. ప్రత్యేకత కనబరుస్తున్నారు ఈ ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కృషిపై ప్రత్యేక కథనం.
విశాఖలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ.. రక్షణ రంగంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రయోగశాల. 50 ఏళ్లకు పైగా భారత నౌకాదళానికి అవసరమైన అస్త్రాలపై పరిశోధనలు చేసి వాటిని రూపకల్పన చేస్తోంది. పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుని వాటిని పెద్ద ఎత్తున తయారు చేసి అందించడమే ఈ సంస్థ ప్రక్రియ. ఈ కార్యచరణలో మహిళా అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది పాత్ర అద్వితీయం. యుద్దనౌకలపై జరిగే ప్రయోగాలలో వీరి పాత్ర కీలకం. అంతేకాకుండా పురుషులతో సమానంగా రెండు, మూడు రోజులపాటు సబ్ మెరైన్ ప్రయోగాలలో సైతం పాల్గొన్న సత్తా వీరిది. కేవలం శాస్త్ర సాంకేతిక అంశాలపై అధ్యయనాలు, ప్రయోగాలకే పరిమితం కాకుండా సమాజ హితం కోసం తమ వంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. దాని ఫలితంగా ఏర్పడినదే మహిళా కళ్యాణ్ మంచ్. మహిళా శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తల సతీమణులు, అధికారులు, సిబ్బంది అంతా ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నారు.
తమ చుట్టూ ఉన్న సమాజం కోసం తమ వంతుగా సాయం చేయడాన్ని అలవాటుగా రూపొందించుకున్నారు. నిరుపేద మహిళలకు వివిధ వృత్తులలో శిక్షణ కల్పిస్తున్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. వారు తయారు చేసిన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. దీనివల్ల వారికి ఆదాయాన్ని సమకూర్చడంలోనూ విశేష చొరవ కనబరుస్తున్నారు. ఈ రకమైన సేవ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు అంటున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న దివ్యాంగుల పాఠశాలకు వెళ్లి.. వారు తయారు చేసిన స్వయంగా విక్రయించి.. వచ్చిన సొమ్మును పాఠశాలకు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా అంధుల పాఠశాలకు కావలసిన నగదు సహాయాన్ని అందించినట్లు వివరించారు.
ప్రస్తుతం చేస్తున్న కార్యాక్రమాలతోనే తృప్తి చెందకుండా భవిష్యత్‌లో మరింతగా సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని సంకల్పంగా పెట్టుకున్నారు. ఒకవైపు వివిధ అంశాలపై కొత్త పరిశోధనలలో భాగస్వాములవుతూనే.. మరోవైపు సమాజానికి అవసరమైన అంశాలపై దృష్టి పెడుతున్న ఈ మహిళల తీరు ప్రశంసలను అందుకుంటోంది.
ఇవీ చదవండి :