లంబసింగిలో చలికాలంలో ఉష్ణోగ్రతలు సుమారు 5 డిగ్రీలకు పడిపోతాయి. 2019లో అత్యల్పంగా 2.5 డిగ్రీలు కూడా నమోదైంది. చలితో పాటు పొగమంచు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఎత్తైన కొండపై ఉన్న చెరువులవెనం ఆదివాసీ గ్రామం ప్రత్యేక వ్యూపాయింట్‌గా ప్రాచుర్యం పొందింది. ఇదివరకు పండగలు, వారాంతపు సెలవు రోజుల్లోనే సందర్శకుల తాకిడి ఉండేది. క్రమంగా సాధారణ రోజుల్లోనూ వీరి సంఖ్య పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఏటా 70వేల మంది ఇక్కడికి వస్తుంటారు. ఎంతో ఆశతో వచ్చే పర్యాటకులను ఇక్కడి సౌకర్యాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వెళ్లేందుకు, ఉండేందుకూ సమస్యే
వారాంతపు రోజుల్లో లంబసింగి, వంజంగి ప్రాంతాల్లో పొగమంచుతో నిండిన కొండలను చూడడానికి వచ్చే పర్యాటకులతో ఘాట్ రోడ్డు కిటకిటలాడుతుంటుంది. వాహనాల రద్దీని నియంత్రించే వారు లేక ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. తీరా పర్యటక ప్రాంతానికి చేరుకున్నాక వసతి సమస్య వేధిస్తోంది. లంబసింగిలో రూ.5 కోట్లతో నిర్మించిన రిసార్టులు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రైవేటు గుడారాలు నిర్వహించేవారు అడ్డగోలుగా దోచేస్తున్నారు.
ఆపద వస్తే అంతే..
లంబసింగి వచ్చే పర్యాటకులు చెరువెలవెనం కొండపైకి వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. అక్కడికి చేరుకోవాలంటే ఎత్తుపల్లాలు, రాళ్లురప్పలతో దుర్భరంగా ఉన్న కాలిబాటలో వెళ్లాలి. తెల్లవారుజాము నుంచే ఈ కొండపైకి పర్యాటకులు వెళ్తుంటారు. సెల్‌ఫోన్ వెలుగులోనే వెళ్లాలి. మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కూడా లేవు. కొండ నిటారుగా ఉండడంతో మార్గమధ్యంలోనే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. అనుకోని ఆపద కలిగినా, ప్రమాదం సంభవించినా వారిని పట్టించుకునే వారే లేరు. కనీస ప్రాథమిక వైద్యం అందే పరిస్థితులు ఇక్కడ లేవు. ఇన్ని అవస్థల నడుమ ప్రకృతి అందాలను ఆస్వాదించలేక కొందరు ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. కొండపైకి వెళ్లడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కనీసం మెట్ల మార్గమైనా ఏర్పాటు చేసుంటే బాగుండేదని సందర్శకులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
కొండపైకి వెళ్లేందుకు త్వరలో రోప్‌వే, మెట్ల మార్గాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తాం.
- ఏపీ పర్యటక సంస్థ డీవీఎమ్ ప్రసాద్‌రెడ్డి
ఇదీ చదవండి:
నేటి నుంచే నామినేషన్లు.. ఎలాంటి ఏర్పాట్లూ చేయని జిల్లా అధికారులు