విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై... జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ.. పర్యావరణ అనుమతుల్లేకుండానే కార్యకలాపాలు నిర్వహించిందని... కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు ముక్తకంఠంతో చెప్పినట్లు ఎన్జీటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించినందున... జరిగిన నష్టానికి ఆ కంపెనీయే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ...... జస్టిస్ శేషశయనా రెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ చేయించి నివేదిక తెప్పించుకుంది. నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణపై ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్‌తో కూడిన ధర్మాసనం 53 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమతుల్లేకుండా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ కార్యాకలాపాలు.. ప్రారంభించడానికి సమ్మతించిన అధికారులను గుర్తించి తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ ఆదేశించింది. తీసుకున్న చర్యలపై.. 2 నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా కార్యాకలాపాలు నిర్వహించడానికి ఎల్‌జీ పాలిమర్స్‌కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చట్టవిరుద్ధంగా అనుమతించినట్లు. స్వతంత్ర నిపుణుల కమిటీ తేల్చిచెప్పినట్లు ఎన్జీటీ వెల్లడించింది. చట్టాన్ని పట్టించుకోకుండానో లేదా ఇతరత్రా కారణలతోనో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ పని చేసిందన్న ఎన్జీటీ..తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని.... దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల బాధ్యత ఎంతన్నది లోతుగా నిర్థారించాలని స్పష్టం చేసింది.
విశాఖ జిల్లా కలెక్టర్ దగ్గర ఎల్జీ పాలిమర్స్ సంస్థ డిపాజిట్ చేసిన... 50 కోట్ల రూపాయలు తాత్కాలిక పరిహారం చెల్లింపునకు సరిపోతాయని.. ఎన్జీటీ స్పష్టం చేసింది. అంతిమ నష్ట పరిహారాన్ని నిర్ణయించేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ-నీరీ ప్రతినిధులతో కమిటీ వేయాలని ఆదేశించింది. 2నెలల్లో.. ఈ కమిటీ నివేదిక అందజేయాలని సూచించింది. ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లో జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చడానికి.. 2 నెలల్లోపు పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళిక రూపొందించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇందుకోసం.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన సభ్యులు ఇద్దరు చొప్పున.. విశాఖ కలెక్టర్, సంబంధింత శాఖలకు చెందిన ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని.. స్పష్టం చేసింది. పునరుద్ధరణ ప్రణాళిక ఆధారంగా బాధితులకు పరిహారం చెల్లించాలని ఎన్జీటీ తెలిపింది.
ఎల్‌జీ పాలిమర్స్ చట్టబద్ధమైన అనుమతులు తీసుకోకుండా...కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి వీల్లేదని ఎన్జీటీ తేల్చిచెప్పింది. ఒకవేళ ఏవైనా అనుమతులిచ్చినా, ఆ కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి ఉపక్రమించినా...వెంటనే ట్రైబ్యునల్ దృష్టికి తేవాలని స్పష్టం చేసింది. ప్రమాదకర రసాయన పరిశ్రమల్లో..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి.. ప్రస్తుత పర్యవేక్షణ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలన్న ఎన్జీటీ.. అవసరమైన సూచనలు చేయడానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిశ్రమలపై ఒక స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి మూడవారాల్లోపు చర్యా నివేదికను సమర్పించాలని.... సూచించింది. ఎలాంటి ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలైనా తప్పనిసరిగా ప్రజలు, పర్యావరణ భద్రతకు లోబడే ఉండాలన్న ఎన్జీటీ... కాలుష్యానికి కారుకులైన వారే అందుకు మూల్యం చెల్లించాలని.. చట్టబద్ధమైన సంస్థలు ఇలాంటి విషయాల్లో కీలక పాత్ర వహించాలని స్పష్టం చేసింది.
విశాఖ గ్యాస్ లీకేజీలా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే కేసుల్లో... తాము చేతులు కట్టుకొని కూర్చోలేమని ..సుమోటోగా విచారించే అధికారం తమకుందని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ నష్టం, ఆస్తి నష్టం, వాటి పునరుద్ధరణ లాంటి విషయాల్లో... బాధితులకు పరిహారం అందించడం తమ హక్కు అని పేర్కొంది. గ్యాస్ లీకేజీ ఘటనను ఎన్జీటీ సుమోటోగా స్వీకరించి ఉండాల్సింది కాదంటూ ఎల్‌జీ పాలిమర్స్ పిటిషన్‌లో పేర్కొనడంపై బెంచ్ మండిపడింది.
ఇదీ చదవండి: