Nadendla Manohar on YSRCP: రాష్ట్ర విభజనపై మాట్లాడిన వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లోనే ఏపీ ఆస్తులు తెలంగాణకు కట్టబెట్టి.. ఇప్పుడేమో రాష్ట్రం కలిసి ఉంటే బాగుంటుందని మాట్లాడుతూ ప్రజలను అయోమయ స్థితిలోకి నెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని.. వారి ఆత్మహత్యలు దారుణమని మండిపడ్డారు. బీసీ సభకు జనాలను ఆర్టీసీ బస్సులలో తరలించారని.. ఏపీఎస్ఆర్టీసీ సంస్థను వైఎస్ ఆర్టీసీగా మార్చేశారని విమర్శించారు. జగనన్న కాలనీ ఒక పెద్ద కుంభకోణమని.. భూములు రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి' విషయంలో కొందరు మీడియా సమావేశాలలో కంగారు పడిపోతున్నారని విమర్శించారు. జనసేన నిబంధనలకు లోబడే నడుచుకుంటుందని అన్నారు.
జనసేన జనవరి 12వ తేదీన యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని రణ స్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని.. దీనిని యువజనోత్సవ వేడుకగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు మనోహర్ తెలిపారు. యువతకు భరోసా ఇవ్వడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి: