విశాఖ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన యువకుడు సందీప్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలే.. సందీప్ హత్యకు దారి తీశాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ వెల్లడించారు. ఈనెల 11న పట్టణంలోని రామనగర్‌కు చెందిన సాయి షణ్ముఖరావు(20).. బైకుపై అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు ముదునూరు సాయివర్మతో కలిసి ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లి వస్తున్నారు. దారిలో సింగ్ హోటల్ కూడలి వద్ద గతంలో సాయితో పరిచయ ఉన్న సందీప్, సాయి, వెంకీలను మారుపేర్లతో పలకరించి హేళన చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. షణ్ముఖరావు, సాయివర్మ అక్కడి నుంచి వెళ్లినట్లే వెళ్లి వెనక్కి వచ్చి సందీప్‌ను బైకుతో ఢీకొట్టారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల వారు దాడి చేసుకున్నారు. స్థానికులు మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కర్రలు, కత్తితో దాడి: అనంతరం అదే రోజు సాయంత్రం షణ్ముఖరావు, సాయివర్మ.. చినవాల్తేర్‌లోని స్నేహితులతో కలిసి సింగ్ హోటల్ కూడలి వద్దకు వెళ్లారు. సందీప్, అతని స్నేహితులు అక్కడ లేరని.. డాబా గార్డెన్స్ లలితా కాలనీలోని పార్కులో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. సాయివర్మ కత్తితో, మిగతా వారంతా కర్రలతో సందీప్‌పై దాడిచేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ సందీప్‌ను స్నేహితులు కేజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు.. తాజాగా ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ హర్షిత చంద్ర వివరించారు.
ఇదీ చదవండి: ఉరేసుకుని మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య.. కారణమేంటి?