విశాఖ నగరానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి రూ.5,174 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విశాఖలో పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించడానికి రూ.500 కోట్లతో ఉప్పునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి నగరానికి రూ.3,339 కోట్లతో పైపులైను నిర్మాణానికి సవివర పథక నివేదిక (డీపీఆర్) తయారైందన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించడానికి జాతీయ రహదారిపై నాలుగు ప్రాంతాల్లో రూ.1,000 కోట్ల వ్యయంతో పైవంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.23కోట్ల వ్యయంతో 25 థీమ్‌పార్కుల నిర్మాణంతోపాటు 14 ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణకు రూ.15కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. రూ.100 కోట్ల వ్యయంతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన రహదారుల్లోకి వాహనాలు సునాయాసంగా రావడానికి వీలుగా పనులు చేపడతామన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు రూ.25కోట్లతో రహదారులు, కూడళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. నగరంలోని 8 జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున రూ.72కోట్లతో అధునాతన వసతులతో ఏసీ కల్యాణ మండపాలు నిర్మిస్తామన్నారు. ముడసర్లోవ పార్కు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. నగరంలో 742 మురికివాడలను గుర్తించామని వాటిలో నివసిస్తున్న వారందరికీ పట్టాలివ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన స్థలాల్లో ఆవాసాలు ఉన్నవారికి పట్టాలు ఇచ్చి, ఆయా సంస్థలకు ప్రత్యామ్నాయ స్థలాలు అందజేస్తామన్నారు. విశాఖలో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా 100 నుంచి 150 ఎకరాల్లో స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రూ.3వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఆకర్షణీయ ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిలో అభివృద్ధి చేసిన టౌన్‌హాల్, పాత మున్సిపల్ కార్యాలయాల్లో కోస్తా, ఉత్తరాంధ్ర నాగరికతకు సంబంధించిన అంశాలపై మ్యూజియం ఉంటాయని తెలిపారు. పేదలకు ప్రభుత్వం కేటాయించిన జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్ గృహకల్ప గృహాలకు రూ.79కోట్లతో మరమ్మతులు చేసే పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీలో 98 వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయించామని, మౌలిక వసతుల పనులు త్వరలో చేపడతామన్నారు. నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి