విజయనగరం 'మాన్సాస్' ట్రస్టు భూముల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి గడువులోగా నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. దేవాదాయశాఖ భూముల పరిరక్షణ, 'సింహాచలం' పంచగ్రామాల సమస్యపై బుధవారం విశాఖలో మంత్రులు వెలంపల్లి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు నేతృత్వంలో దేవాదాయశాఖ కమిషనరు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది. అనంతరం సమీక్షలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
విచారణలో తేలే అంశాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఉంచి ఆయన అనుమతితో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ‘విజయనగరంలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న 14వేల ఎకరాల భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ట్రస్టుకు ఉన్న 14 విద్యా సంస్థలకు ఒక్కరే కరస్పాండెంట్ ఉన్నారు. ఎటువంటి లెక్కలు లేవు. పదేళ్లుగా ఆడిటింగ్ నిర్వహించలేదు. వీటన్నింటికీ సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పలువురు శాసన సభ్యులు అభ్యర్థించడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను దేవాదాయశాఖ మంత్రి ఆదేశించారు’ అని విజయసాయి చెప్పారు. ట్రస్టు భూములకు సంబంధించి పలు ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు.
అశోక్ గజపతిరాజును మళ్లీ తొలగిస్తాం
‘అశోక్ గజపతిరాజువల్లే పంచ గ్రామాల్లో భూ సమస్య తలెత్తింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తాం. అతి త్వరలో ఆయనను ఆ కుర్చీ నుంచి తొలగిస్తాం’ అని విజయసాయి చెప్పారు. పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుంటే అడవుల్లో భూములిస్తున్నారని అశోక్‌గజపతిరాజు విమర్శించడం తగదని మంత్రి వెలంపల్లి పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలతో తలపాగా వేయకపోతే.. మంత్రి వద్దనడంతోనే వేయలేదని చెప్పడం భావ్యం కాదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: