విశాఖ జిల్లాలోని రావికమతం పోలీసులు రెండు రోజుల పాటు శ్రమదానం చేసి రహదారికి మరమ్మత్తులు చేపట్టారు. రావికమతం మండల పరిధిలోని బిఎన్ రహదారి అస్తవ్యస్తంగా ఉంది. ఈ దారి గుండా ప్రయాణమంటేనే అధ్వానంగా మారింది. రహదారులు, భవనాల శాఖ అధికారులు కనీస మరమ్మత్తులు సైతం నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారు. ఫలితంగా రహదారి అంతా గోతులమయంగా తయారైంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గోతులమయంగా మారి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
అక్కడ డీఐజీ పర్యటన..
ఈ నెల 23న విశాఖ రేంజీ డీఐజీ ఎల్కేవీ రంగారావు రావికమతం, కొత్తకోట ఠాణాల్లో పర్యటించారు. కారులో ప్రయాణిస్తూ రహదారి దారుణంగా ఉండటం గమనించిన డీఐజీ రంగారావు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
మరమ్మత్తులు..
ఫలితంగా స్పందించిన పోలీసులు మండల కేంద్రం రావికమతంలోని గోతులకు మరమ్మత్తులు చేశారు. మేడివాడ- గర్నికం మధ్య రహదారిని స్టోన్ క్రషర్ బుగ్గితో చదను చేశారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి, రావికమతం శిక్షణ ఎస్సై సూర్యనారాయణ అధ్వర్యంలో పనులు చేసి శబాష్ అనిపించుకున్నారు.
వారికి ఉపశమనం..
పోలీసుల చర్యలతో వాహన చోదకులకు ఉపశమనం కలుగుతోంది.
ఇవీ చూడండి : ఏపీలో కొత్తగా 2,901 కరోనా కేసులు.. 19 మంది మృతి