స్వర్ణకారులు వెండి, బంగారంతో రకరకాల ఆభరణాలను తయారు చేయడమే చాలామందికి తెలుసు. విశాఖ జిల్లా రోలుగుంట గ్రామస్థుడు శ్రీనివాసరావు మాత్రం.. ఈ విషయంలో ప్రత్యేకం. వృత్తిరీత్యా నేర్చుకున్న విద్యకు సృజనాత్మకతను జోడించిన ఆయన.. సూక్ష్మ కళారూపాల తయారీకి ఆధ్యాత్మికతను జత చేస్తూ... అద్భుత ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. పరమశివుని రూపాలను వివిధ సూక్ష్మ కళాకృతుల్లో సృష్టించారు. ప్రతీ ఏటా శివరాత్రి పర్వదినానాన్ని పురస్కరించుకుని ముక్కంటికి సరికొత్తగా ప్రాణం పోస్తున్నారు.
శ్రీనివాసరావు స్వగ్రామం విశాఖ జిల్లా రోలుగుంట గ్రామం. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన ఆయన... ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. సూక్ష్మ కళారూపాల తయారీకి కేటాయించారు. స్వర్ణకార వృత్తిలో ఆరితేరిన అనుభవంతో.. వెండి, బంగారాన్ని వాడుతూ.. విభిన్నమైన శివుని రూపాలను తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు గ్రాము, గ్రామున్నర బంగారంతోపాటు.. వెండితో కైలాసనాథుడిని రూపొందించారు.
ప్రతి మహాశివరాత్రి రోజున స్వర్ణకారుడు శ్రీనివాసరావు, శివుని ఆకారంతో కూడిన వివిధ ఆకృతులను తయారుచేసి తన సృజనాత్మకతను నిరూపించుకుంటున్నారు. త్వరలోనే... ప్రపంచంలోని 7 వింతలను సూక్ష్మరూపాల్లో తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు స్వర్ణకళాకారుడు శ్రీనివాసరావు.