వాల్తేర్ డిజిల్ లోకో షెడ్ సీనియర్ మెకానికల్ ఇంజినీర్ ఎస్.కె పాత్రో ఆయన బృందం రిమోట్ తో నడిచే రోబోను రూపొందించింది. కొవిడ్ బాధితులు ఉండే వార్డుల్లో తరుచుగా డాక్టర్లు నర్సులు వెళ్లే పని లేకుండా దీని ద్వారా మందులు, ఆహారం సరఫరాకి వీలవుతుంది. చికిత్స పొందుతున్న బాధితుల శరీర ఉష్టోగ్రతను కూడా నమోదు చేసి తేడా ఉన్నట్టయితే వెంటనే సంబంధిత వైద్యున్ని అప్రమత్తం చేస్తుందీ రోబో. ఇదంతా స్మార్ట్ ఫోన్ తో పని చేయించే విధంగా రూపకల్పన చేశారు.
ఈ రోబోను విశాఖలోని రైల్వే డివిజనల్ ఆసుపత్రికి అందజేశారు. వైఫైతో ఈ రోబో ఆయా కొవిడ్ వార్డుల్లో పని చేస్తుంది. రిమోట్ కంట్రోల్ యూనిట్, నైట్ విజన్ 2ఎంపి కెమెరా, స్టెయిన్ లెస్ స్టీల్ రాడ్, షీట్లతో దీనిని రూపొందించారు. ఒక కేవీఏ బ్యాటరీతో ఇది పనిచేస్తుంది. ఇది డెస్క్టాప్, రిమోట్, మొబైల్ ఆధారంగా కూడా ఆపరేట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఈ మెడ్ రోబోను రూపకల్పన చేసిన ఇంజీనీరింగ్ బృందాన్ని డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. ఇప్పటికే కొవిడ్ నివారణ చర్యలలో పలు పరికరాలను విశాఖ డిజిల్ లోకోషెడ్ రూపొందించి రైల్వేల్లో ప్రత్యేక గుర్తింపుపొందింది.