కళా నైపుణ్యాన్ని నమ్ముకున్న వారిపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బొమ్మల తయారీ తప్ప మరో పని తెలియని వీరికి లాక్డౌన్ పెద్ద శాపంగా మారింది. గ్రామంలో ఎవర్ని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. ఒకప్పుడు లేతుల చప్పుళ్లతో పండుగలా ఉండే గ్రామమంతా ఇప్పుడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఈ వేదనంతా విశాఖ జిల్లా ఏటికొప్పాక లక్కబొమ్మల కళాకారులది.
సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఏటికొప్పాక బొమ్మలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పెళ్లిళ్లు, వేడుకలకి ఈ బొమ్మలను బహుమతులుగా అందిస్తే ఆ ప్రత్యేకతే వేరు.
అంతటి విశిష్టత కలిగిన ఈ కుటీర పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేల రూపాయల పెట్టుబడితో తయారు చేసిన లక్కబొమ్మలు మూలన పడ్డాయి. లాక్డౌన్ వలన ఒక్క బొమ్మ సైతం అమ్మలేని దుస్థితి ఏర్పడింది.
'మా బాధలు చెప్పుకునేందుకు మాటలు రావటం లేదు కన్నీళ్లు తప్ప' అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఒక్క ఉచిత బియ్యంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. రెండు మూడు నెలల వరకు తమ షాపులు తెరిచే పరిస్థితి లేదనీ... అప్పటి వరకు ఎంత మంది ఆకలిని తట్టుకొని ఉండగలరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇదీ చదవండి: పోరాడుతున్నా... వెంటాడుతూనే ఉంది!