అయిదేళ్ల తరువాత..
2014 హుద్‌హుద్ తుపానుకు విశాఖపట్నం తీవ్ర ప్రభావానికి గురైంది. కైలాసగిరి మీద చెట్లన్నీ నేలమట్టమయ్యాయి. పచ్చదనమంతా తుడుచు పెట్టుకుపోయింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు కింద రుణం తీసుకొని కైలాసగిరి పునరుద్ధరణ, ఉద్యానవనాల పునరాభివృద్ధి ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఇందుకు కొండపై 380 ఎకరాల్లో రూ.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత సమగ్ర నివేదిక తయారీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతితో వీఎంఆర్‌డీఏ గత ఏడాది టెండర్లకు వెళ్లింది. సరైన గుత్తేదారులు దరఖాస్తు చేసుకోకపోవడంతో పలుమార్లు టెండర్లను వాయిదా వేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని మార్పులు చేయడంతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒకే ఒక్క సంస్థ ముందుకురాగా వారికే పనులు అప్పగించారు.
రూ.56 నుంచి 61 కోట్లకు..
మొదట ఈ ప్రాజెక్టును రూ.56 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. టెండర్లు ఖరారయ్యే సమయానికి అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాజెక్టును రూ.61.93 కోట్లకు పెంచారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఇతర అనుమతులన్నింటినీ ప్రపంచ బ్యాంకుకు పంపి తగిన అనుమతులు ఇప్పటికే తీసుకున్నారు.
ఇలా చేస్తారు..
- వినోదం: ప్రదర్శనశాలలు, అమ్యుజ్‌మెంట్ పార్క్‌లు, పిల్లల కోసం ప్రత్యేక క్రీడా ప్రాంగణాలు, గేమింగ్ జోన్.
- ఉద్యానవనాల అభివృద్ధి: కొండపై ఎక్కడికక్కడ పచ్చిక మైదానాలు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం 79,125 చ.మీ. మేర మొక్కలు నాటనున్నారు. నడక దారుల్లో విశ్రాంతి బల్లలు సమకూర్చనున్నారు. కొండపై కొత్త మార్గాల ఏర్పాటు, సేదతీరే ప్రాంతాన్ని విస్తరించనున్నారు.
- రవాణా: కొండపై అన్ని రకాల వాహనాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ స్థలాలను గుర్తించనున్నారు. ఒకేసారి 150 కార్లు, 25 బస్సులు, 200 ద్విచక్ర వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పర్యావరణహిత వాహనాలు అందుబాటులోకి వస్తాయి. ఇంకా మరిన్ని హంగులు సమకూర్చనున్నారు.
పర్యావరణహితంగా:
కైలాసగిరి పునరుద్ధరణ పనులకు సంబంధించిన టెండరు ప్రక్రియ పూర్తయింది. గత వారమే నిర్మాణదారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాం. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ఇక్కడ చేపట్టే అభివృద్ధి పనులన్నీ పర్యావరణహితంగా ఉంటాయి. గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. - పి.కోటేశ్వరరావు, కమిషనర్, వీఎంఆర్‌డీఏ
- నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో)
- సివిల్ , ఇతర నిర్మాణ పనులు : 17.12
- భూగర్భ మురుగుకాలువ వ్యవస్థ : 8.03
- కొండపై రహదారుల నిర్మాణం : 8.97
- ఉద్యానవనాలు, సుందరీకరణ పనులు : 16.27
- విద్యుద్ధీకరణ, భద్రతా నియంత్రణ వ్యవస్థ : 11.51
- ప్రాజెక్టు కైలాసగిరి కొండ పునరుద్ధరణ, పునరాభివృద్ధి
- ఎకరాలు 380
- నిధులు రూ.61 కోట్లు
- పనులకు గడువు 12 నెలలు
ఇదీ చదవండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు