ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికుల ఆర్తనాదాలు, ఆత్మహత్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు... జనసేన తీవ్ర నిరసనకు సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ సాగే లాంగ్‌మార్చ్‌లో జనసేనాని పవన్ పాల్గొంటారు. జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జనసేన పార్టీ.. రా సైనికా అంటూ ఓ పాటను రూపొందించి ట్విట్టర్లో పెట్టింది. జనసేన నిరసన వెనక తెలుగుదేశం ఉందన్న విజయసాయి విమర్శలను.... తోట చంద్రశేఖర్ ఖండించారు. ఇసుక అక్రమ రవాణా ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. సర్కార్ జనసేనను సంప్రదిస్తే.... కేవలం 5 రోజుల్లో ఇసుక సంక్షోభం తీరే పరిష్కారం సూచిస్తామని చెప్పారు.
అర్ధరాత్రి వరకూ..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న లాంగ్‌మార్చ్‌ను... సాగరతీరంలో నిర్వహించేందుకు పార్టీ అనుమతి కోరినా.. అధికారులు తిరస్కరించారు. రాత్రి సభాస్థలి నిర్మాణంలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాంగ్ మార్చ్ తర్వాత ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట సెంట్రల్ పార్క్‌కు ఆనుకుని ఉన్న ప్రదేశంలో వేదిక ఏర్పాటుకు... జనసేన అనుమతి కోరింది. చివరి నిమిషంలో వేదిక ఏర్పాటు కుదరదని పోలీసులు అడ్డుతగిలారు. సభకు వచ్చే వారికి ఇబ్బంది తలెత్తకుండా సర్వీసు రోడ్డుపైనే ఏర్పాటు చేస్తున్నామని పార్టీ వర్గాలు వివరించాయి.
ఒక దశలో వేదికను బలవంతంగా ఏర్పాటు చేసేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించడంతో... తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ... జనసేన నేత పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్ ఆందోళనకు దిగారు. పలు దఫాల చర్చలతో... అర్ధరాత్రి 12 గంటల తర్వాత అనుకున్న చోట వేదిక ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. వేదిక ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు.
ఏయూలో పార్కింగ్
జనసేన లాంగ్ మార్చ్‌కు వచ్చే వారికోసం... పార్కింగ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతా వీడింది. ఏయూలో పార్కింగ్‌కు మొదట అనుమతించినా... తర్వాత రద్దు చేశారు. ఎంవీపీలోని అల్వార్ దాస్ మైదానంలో పార్కింగ్‌కు అనుమతించారు.
వామపక్షాలు దూరం..
జనసేన లాంగ్ మార్చ్‌లో తెలుగుదేశం ప్రత్యక్షంగా పాల్గొంటోంది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు సహా... అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని ఆ పార్టీ ప్రకటించింది. భాజపా, వామపక్షాలు ఆందోళనకు సంఘీభావం తెలిపినా... నిరసనలో పాల్గొనడం లేదు. లాంగ్‌మార్చ్‌కు జనసేన భాజపా మద్దతు కోరడంపై.... వామపక్షాలు దూరంగా ఉండిపోయాయి.
ఇదీ చదవండి: