విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పచ్చదనానికి గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆలయ ఈవో సూర్యకళకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఐఎస్‌వో ధ్రువపత్రం అందజేశారు. అంతకుముందు స్వామి వారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో సూర్యకళ మంత్రికి ప్రసాదాన్ని అందించారు.
సింహాచలం ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు లభించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రసాదం పథకం కింద దేవస్థానానికి సుమారుగా రూ.53 కోట్లు నిధులు కేటాయించారని వెల్లడించిన అవంతి.. ఆ నిధులతో తొందరలోనే పనులు చేపడతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ గుర్తింపునకు శ్రమించిన దేవస్థానం అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో త్వరలోనే పంచగ్రామాల్లో భూసమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
ఆనందం వ్యక్తం చేసిన సోమువీర్రాజు...
సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు(ఐ.ఎస్.ఓ) రావటంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్(PRASHAD) పథకం కింద ఆలయ అభివృద్ధికి 53 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో త్వరలోనే అనేక అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.