తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రైతు.. జిల్లా ఎస్పీని కలిసి కోరాడు. జిల్లాలోని ఎలమంచిలి శాసన సభ్యుడు, వారి అనుచరుడు కలిసి తన స్థలాన్ని కబ్జా చేసి బెదిరిస్తునారని ఫిర్యాదు చేశాడు. విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు రక్షణ కల్పిస్తానని అతనికి హామీ ఇచ్చారు.
- భూమిపై కన్ను
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రైతు పైలా వెంకట స్వామికి 32 ఎకరాల భూమి ఉంది. అందులో అతను వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఎలమంచిలి శాసన సభ్యుడు యూవీ రమణ మూర్తి రాజు(కన్నబాబు), అతని అనుచరుడు పేతకం శెట్టి రామస్వామి(పీఆర్ఎస్) నాయుడు.. తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని రైతు వెంకట స్వామి ఆరోపించాడు. గత శనివారం రాత్రి పీఆర్ఎస్ నాయుడు అనుచరులు తన ఇంటి మీదకు వచ్చి దాడి చేశారని చెబుతున్నాడు. స్థలం వదిలి పోవాలని హుకుం జారీ చేశారని.. అందుకే జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశానని తెలిపాడు. తనకు ప్రాణ రక్షణ కావాలని కోరుతున్నాడు.
ఎమ్మెల్యే యూవీ రమణ మూర్తి గతంలో ఇదే తరహాలో భూమి లాక్కొనే ప్రయత్నం చేస్తే కోర్టు ద్వారా అడ్డుకున్నామని మరో రైతు సత్య చెప్పాడు. ఇప్పుడు మళ్లీ దౌర్జన్యం చేస్తున్నారని... చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు కూడా ఎమ్యల్యేతో కుమ్మక్కయ్యారని ఆరోపించాడు. పార్టీ పెద్ద విజయ సాయి రెడ్డికి కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.
జిల్లా ఎస్పీ తమకు రక్షణ కల్పించకపోతే... ప్రాణ హాని మాత్రం ఖాయం అంటున్నారు బాధిత రైతులు. ఈ వ్యవహారాన్ని వైకాపా పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు.
ఇవీ చదవండి
'మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'
మంగళగిరిలో వైకాపా ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు