విశాఖ జిల్లా పాయకరావుపేటలో శనివారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. లింగాల కాలనీ, ఇందిరా కాలనీ, ముస్లిం కాలనీ తదితర చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఈ కారణంగా స్థానికులు అవస్థలు పడ్డారు.
విశాఖ నగరంలో భారీ వర్షం...
విశాఖ నగరంలో పట్టపగలు చీకటి ఆవరించింది. భారీ ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. లాక్డౌన్ కారణంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఇతర పర్యవేక్షక సిబ్బంది రహదారులపై ఇబ్బందులు పడ్డారు. విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగానే కురిసింది. డుంబ్రిగుడలో భారీ వర్షానికి సంపంగి గెడ్డ ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.
మాడుగుల, చీడికాడ మండలాల్లో భారీ వర్షం
మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఎండకు అల్లాడిన ప్రజలు.. కాస్త ఉపశమనం పొందారు.
అనకాపల్లిలో....
అనకాపల్లి లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం సమయంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. సత్యనారాయణపురంలోని దొంగ గడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నర్సీపట్నంలో...
నర్సీపట్నంతోపాటు రావికమతం, రోలుగుంట తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. నిధుగొండ, కె.నాయుడు పాలెం, కొవ్వూరు, సరభవరం, కోమరవోలు, కొండపాలెం, కొత్తకోట, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.