విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలో ఏటా వందల కోట్ల రూపాయల పనులు జరుగుతూ వస్తున్నాయి. వీటి బిల్లులు దశలవారీగా, పూర్తిగా పనులు పూర్తయిన తర్వాత చెల్లిస్తుంటారు. సాధారణ పనుల కింద రహదారులు, కాలవలు, భవన నిర్మాణాలు వంటివి మహానగర పాలక సంస్థ పరిధిలో వివిధ వార్డుల్లో జరుగుతుంటాయి. జోన్ల వారీగా ఇవి నిరంతర ప్రక్రియగా సాగుతుంటాయి.
గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసినా, ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులకు కూడా ఇంతవరకూ బిల్లులు మంజూరు చేయకపోవడం ఆర్థికంగా గుత్తేదార్లను కుంగదీస్తోంది. లాక్ డౌన్ వేళ అన్ని రంగాలు కుదేలైన పరిస్థితుల్లో అప్పులు చేసి పనులు చేసినా.. డబ్బులు తిరిగిరాక తమకింద పనిచేసే వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని గుత్తేదార్లు అంటున్నారు. 14 నెలలుగా బిల్లులు రాకపోవటంతో దాదాపు రూ. 350 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఎస్పీ, ఎస్డీఎఫ్ పనుల కింద 18 నెలలుగా మరో రూ. 50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీలు రూ. 15 కోట్ల వరకు చెల్లింపులు నిలిచిపోయాయి. పనులు పూర్తిచేసి రెండేళ్లు గడిచినా చెల్లింపులు జరగలేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక, వడ్డీలు కట్టలేక, కొత్త పనులు చేపట్టకపోవటంతో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది కార్మికుల ఉపాధికి ఇక్కడా గండి పడింది.
గత ప్రభుత్వంలో మంజూరైన రూ. 199 కోట్ల పనులు రద్దు చేసినప్పటికి వాటి ఈఎండీలు వెనక్కి ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. జూన్ లో జీవీఎంసీ కమిషనర్‌తో భేటీ అయిన కాంట్రాక్టర్లుకు 10 నెలలు బిల్లుల చెల్లిస్తామని హామీ వచ్చింది. కానీ అది కార్యాచరణలోకి రాలేదు. గురువారం నుంచి జీవీఎంసీ పరిధిలో దాదాపు రూ. 250 కోట్లకు పైగా అభివృద్ధి పనులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే నగరంలో గడచిన ఏడాది కాలంగా రోడ్లు, కాలువలు నిర్మాణంతోపాటు శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తే ఆ ప్రభావం తీవ్రంగానే ఉండనుంది.
ఇవీ చదవండి...
ప్రవర్తన మార్చుకోని రౌడీషీటర్లు.. నగర బహిష్కరణ దిశగా పోలీసుల ఆలోచన!