ఎల్జీ పాలిమర్స్ విషవాయు కల్లోలంతో ఊరు వదిలి వెళ్లిన.. ఆర్ఆర్ వెంకటాపురం, వెంకటాద్రి నగర్, నందమూరి నగర్, పైడిమాంబ కాలనీ, బీసీ కాలనీల్లో సాధారణ స్థితి నెలకొనేలా.. విశాఖ నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. జీవీఎంసీ కమిషనర్ సృజన నేతృత్వంలో.. గ్రామాల్లో పారిశుద్ధ్య బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 300 మంది సిబ్బంది... స్టైరిన్ దెబ్బకు చచ్చిపోయిన చెట్లు, మొక్కల్ని నరికేశారు. ఇళ్లపై రసాయనాల్ని పిచికారీ చేశారు. ప్రతి ఇంటి చుట్టూ బ్లీచింగ్ చల్లి... ఇంటి పరిసరాల్లో చెత్తను తొలగించారు. గ్రామాల్లో నీరు కలుషితమైన కారణంగా దూర ప్రాంతం నుంచి ట్యాంకర్ల ద్వారా తెప్పించి అక్కడివారికి మంచినీళ్లు అందించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు గ్రామస్థులకు భరోసా కల్పించేలా... కీలక సూచనలు చేశారు. ఇళ్లలోకి వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి.. మంచి గాలి ప్రసరించేలా ఫ్యాన్లు వేసి ఉంచాలన్నారు. ఇళ్లలో దుమ్ము, ధూళి దులిపాక.. శానిటైజర్లు, ఫ్లోర్ క్లీనర్లతోనే నేల, గచ్చులను శుభ్రం చేయాలని చెప్పారు. వంటగదిలోని సరకులు.. ఫ్రిజ్‌ల్లోని కూరగాయలు, డైనింగ్ టేబుళ్లపై ఉన్న పదార్థాలనూ పారవేయాలన్నారు. వంటపాత్రలు, ఆహార ధాన్యాలు నిల్వచేసే డబ్బాలనూ పూర్తిగా శుభ్రపరిచాకే ఉపయోగించాలని సూచించారు.
దుస్తులు, బెడ్‌షీట్లు... కర్టెన్లు తదితర వస్త్రాల్ని పూర్తిగా ఉతికి ఎండలో ఆరబెట్టాకే వాడాలన్నారు. స్టైరిన్ తాలూకు దుర్వాసన వచ్చినా.. ఒక రోజంతా డియోడ్రెంట్లు, రూమ్ ఫ్రెషనర్‌లను ఉపయోగించవద్దని, వాటికి బదులుగా సాంప్రదాయ ధూపం, అగరవత్తులు వాడాలన్నారు. కేంద్ర నిపుణుల బృందం సిఫార్సులనూ పాటించాలని చెప్పారు.
ఇదీ చదవండి: