కరోనా వేళ వలస కూలీలు, పేదల కడుపు నింపేందుకు జీవీఎంసీ, అక్షయపాత్ర ఫౌండేషన్ కలిసి ప్రత్యేక ఏర్పాటు చేశాయి. కరోనా విలయ తాండవం చేస్తున్న గడ్డు కాలంలో నగరంలోని పేదలు, వలస కూలీల.. ఆకలి తీర్చేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని వేలాది మంది అన్నార్తులకు నిత్యం ఆహారం అందించే ప్రక్రియను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి యదు దాస ప్రభు ఆరిలోవలో ప్రారంభించారు. దాతల సహకారంతో అక్షయ పాత్ర చేస్తున్న ఆహార పంపిణీ యజ్ఞానికి జీవీఎంసీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆహార పంపిణీ కార్యక్రమానికి రూప కల్పన చేసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వైజాగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భక్త దాస్, సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. జీవీఎంసీ సంపూర్ణ సహకారంతో నిత్యం 5వేల మందికి ఆహార పొట్లాలు అందిస్తున్నామని ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ భక్తదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి రామ్మోహన్ ఇతరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి… ప్రారంభం కాని రబీ కొనుగోళ్లు... ఆందోళనలో రైతులు