నైపుణ్య భారతం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక శిక్షణా సంస్థల్లో విశాఖలోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికార కేంద్రం భిన్నంగా నిలుస్తున్నాయి. 'గిరిపుత్రికా కౌషల్ వికాస్' పథకంలో భాగంగా వారు అందిస్తున్న కోర్సులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చే మన్యం ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నాయి. సాధారణ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు భిన్నంగా వైద్య ఆరోగ్య రంగానికి అవసరమైన మానవ వనరుల్ని అందించే దిశగా వినూత్న కోర్సుల్ని ప్రవేశ పెడుతున్నాయి. ఈ కోర్సుల్లో గిరి పుత్రికలకు తొలి ప్రాధాన్యతగా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మన్యం వాసుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాయి.
"సకల" శిక్షణ...
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గిరి యువతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, పేషెంట్ కేర్ అసిస్టెంట్స్‌గా వారిని తీర్చిదిద్దుతున్నారు. తరగతి గతి, డిజిటల్ క్లాస్ రూం, ఐసీయూ, పేషెంట్ కేర్ విభాగం, అత్యవసర పరిస్థితిలో రోగిని తరలించేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ యువతుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. విశాఖలోని పైనాపిల్ కాలనీలో ఉన్న ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో వైద్య ఆధారిత కోర్సుల్లో 70 మంది శిక్షణ తీసుకుంటున్నారు.
వైద్యులు కానప్పటికీ... వైద్య వృత్తిలో భాగస్వామ్యం అవుతున్నారు గిరిపుత్రికలు. ఇదేస్ఫూర్తితో ఇంకెందరో జీవితాల్లో... గిరిపుత్రికా కౌషల్ వికాస్" వెలుగులు నింపాలని ఆశిద్దాం...
ఇదీ చదవండీ: వైరల్: ఇడ్లీ తయారీకి టాయిలెట్ వాటర్