విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని పెదబయలు మండలం అరడకోటలో 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ రోజుల్లో రూ.3 వేలు చొప్పున సొమ్ము ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారని తెలిపారు. ఇళ్లల్లో కొన్నేళ్లపాటు నివసించారు. ఈ నివాసాలు శిథిలమవడం వల్ల రెండేళ్ల కిందట కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లను పడగొట్టేశారు. డబ్బులు ఉన్నప్పుడు కట్టుకునేందుకు చదును చేసుకుని చుట్టూ రాళ్లు పెట్టుకున్నారు. అయితే ఇటీవల భూ సేకరణలో రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న ఈ స్థలంపై అధికారుల కళ్లు పడ్డాయి. ఈ రెండు స్థలాలను స్వాధీనం చేసుకుని గ్రామ సచివాలయం నిర్మాణానికి పనులు ప్రారంభించారు. తమ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మించొద్దని ప్రాధేయపడినా అధికారులు కనికరించటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరడకోటలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆవరణలో ఖాళీ స్థలం ఉందని... రహదారి పక్కన ఉన్న స్థలాల్ని ఆక్రమించే ప్రయత్నమే చేస్తున్నారంటూ లబ్ధిదారులు విలపిస్తున్నారు.
కలెక్టర్కు ఫిర్యాదు
పెదబయలు వచ్చిన శిక్షణ కలెక్టర్ ప్రతిష్ట ముంగినికి లబ్ధిదారులు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిర్మాణం నిలిపివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కేటాయించిన స్థలాలు తిరిగి తమకు అప్పగించాలంటూ లబ్ధిదారులు వేడుకుంటున్నారు.