విశాఖ మన్యం సువిశాల కొండకోనల ప్రాంతం. గిరిజనాభివృద్ధి సంస్థ చాలా ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించినా... ఇప్పటికీ రవాణా సదుపాయాలు లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అధిక రుసుము వసూలు చేస్తూ జీపు సర్వీసులు నడుపుతున్నారు. ఎక్కువ సంఖ్యలో జనాలను ఎక్కించడం వల్ల ప్రమాదాల బారిన పడి.. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందులోనూ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వ సర్వీసులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు రావో తెలియని దుస్థితి. ఈ కారణంతోనే.. ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత రవాణా సర్వీసులు మొదలు పెట్టింది పోలీసు శాఖ.
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ముంచంగిపుట్టు నుంచి కుమడ వరకు ఒక సర్వీసు, జి.మాడుగుల నుంచి మద్దిగరువు వరకు మరో ఉచిత సర్వీసును నడిపిస్తున్నారు. కుమడ బస్సు ప్రారంభించి 2 వారాలు అవుతోంది. ప్రతిరోజు 4 సర్వీసులు చేస్తూ గిరిజనులకు అండగా నిలుస్తోంది. ఈ సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీసులకు గిరిజనులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.