విశాఖ శివారులోని ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ నుంచి గురువారం అర్ధరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషవాయువు లీకవుతోంది. పెద్ద ఎత్తున పొగలు బయటకు రావటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలరచేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు సైతం అందరినీ ఖాళీ చేయాలని చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చేశారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో కొంతమంది వెళ్తుండగా.. చాలామంది కాలి నడకన సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
తాజా పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవటంతో ప్రజలు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. అర్ధరాత్రి సమయాన పలువురు ‘ఈనాడు’కు ఫోన్ చేసి తాజా పరిస్థితి ఏమిటంటూ ఆరా తీశారు. మరోవైపు పుణేకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు 9 మంది ప్లాంట్ లోపలకు వెళ్లి వాయువుపై పరిశోధన చేస్తున్నారు. ఇది గురువారం అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతూనే ఉంది. న్యూట్రలైజర్ ద్వారా లోపల నుంచి వాయువు వెలువడకుండా గడ్డ కట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతరం వాతావరణంలో వాయువు తీవ్రతపై పరిశోధన చేయనున్నారు. ‘ఇప్పటికి ఈ ప్రాంతం సేఫ్ జోన్‌లోనే ఉంది. శుక్రవారంలోపు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక ప్రకటన చేయనున్నారు’ అని సీపీ ఆర్కే మీనా అర్ధరాత్రి 12 గంటలు దాటాక చెప్పారు. పరిశ్రమకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో జనాలు తమ నివాసాల నుంచి దూరంగా తరలివెళుతున్నారు. జనం రద్దీతో బీఆర్‌టీఎస్ రోడ్డులో ట్రాఫిక్ భారీగా పెరిగింది.
ఇదీ చదవండి