Accidents in Industries : విశాఖ పరిధిలోని పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో దాదాపు 90 కంపెనీలున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ పరిధిలో208 పరిశ్రమలున్నాయి. గడిచిన నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నగర పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద 2020లో ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు విడుదలై 12 మంది మృతి చెందారు. ఈ ఘటన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణులతో హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి తనిఖీలకు 156వ జీవో విడుదల చేసింది.
2022లో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబటి సుబ్బన్న ఆయిల్స్‌లో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో జీవో-79 తెచ్చారు. పరిశ్రమలు, కార్మిక శాఖలు, కాలుష్య నియంత్రణ విభాగం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి సమన్వయంతో తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇలా ప్రమాదం జరిగిన ప్రతి సారీ హడావుడి చేయడం తప్ప జరగకుండా చేపట్టాల్సిన నివారణ చర్యలు ఏ మాత్రం అమలు చేయడం లేదని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
కార్మికులు ప్రాణాలు తీసిన ఘటనలు : ప్రతి నెలా సేఫ్టీ ఆడిట్ పక్కాగా జరుగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. అయినా ప్రమాదాలు జరుగుతున్నాయని, అప్పుడు మాత్రం పాలకులు హడావుడి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ 'లారస్ ల్యాబ్'లో గత డిసెంబరులో ఓ బ్లాక్‌లో మంటలు వ్యాపించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 31న జీఎన్ఎఫ్సీ ల్యాబ్‌లో బాయిలర్ పేలి ఒకరు చనిపోయారు. కబిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలో ఒకరు మృతి చెందారు.
ఆంజనేయ ఎల్లాయిస్‌లో విస్ఫోటంరెండు ప్రాణాలను బలిగొంది. 8 మందికి గాయాలయ్యాయి. బ్రాండిక్స్ సెవరల్ ఇండియా పరిధిలోని సీడ్స్ దుస్తుల పరిశ్రమలో గతేడాది జూన్, ఆగస్టులో రెండు సార్లు విషవాయువులు కమ్మేశాయి. ఈ ప్రమాదాల్లో 539 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి నోరు మూయిద్దామనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. కానీ ప్రాణాలు కాపాడే దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాద పరిష్కారం కార్యరూపం దాల్చుతుందా? : పారిశ్రామికవాడల్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే క్షతగ్రాతులకు 'బర్న్ వార్డు'లో మెరుగైన చికిత్స అందించాలంటే విశాఖలోని కేజీహెచ్‌కు తీసుకువెళ్లాల్సిందే. ఈ లోపు వైద్యం అందక ప్రాణాలు పోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పరవాడ, అచ్యుతాపురంలలో ఎక్కడైనా అధునాతన వైద్యశాల నిర్మించాలన్న ప్రతిపాదన గతంలో తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఈ-బానింగ్ ఇండస్ట్రియల్ పార్కులో స్థలం గుర్తించారు. కొన్ని కంపెనీలు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వం మారాక ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. తాజా ఘటన నేపథ్యంలో పారిశ్రామికవాడలో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వైద్యం అందించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత-సీఎస్ఆర్ నిధులతో అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బర్న్ వార్డు నిర్మిస్తామని మంత్రి అమర్‌నాథ్ ప్రకటించారు.