విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జగనన్న కాలనీ లే-అవుట్ కోసం చేపట్టిన భూసమీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు రైతులు నిరసన కొనసాగించారు. పెందుర్తి తహసీల్దారు బాబీ ఆధ్వర్యంలో వీఎం ఆర్డీఏ అధికారులు భూములను చదును చేసే పనులు ప్రారంభించారు. రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పోలీసులను రంగంలోకి దించారు.
తమకు న్యాయం చేయాలని రైతులు నినాదాలు చేశారు. తీసుకున్న భూములకు పరిహారంగా ఎకరాకు పట్టా ఉంటే 900 గజాలు, పట్టా లేకుంటే 400 గజాల చొప్పున స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు. పనులను అడ్డుకోవద్దని కోరారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రైతులు కోరగా.. తహసీల్దారు నిరాకరించారు.
తెదేపా మద్దతు : విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తెదేపా హయాంలో ఇక్కడి రైతులకు డీపట్టా భూములు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ భూములు తీసేసుకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అధ్యాపకుల్లేని చదువులు.. ఆందోళనలో విద్యార్థినులు