విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీస్నంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమునిగుమ్మంనకు చెందిన మణికుమార్ అనే యువకుడికి ఈనెల 18న ఒక ఫోన్ వచ్చింది. 'తాను సీఐనని నీతో పాటు నీ సోదరునికి జుట్టు ఎక్కువగా ఉందని.. వెంటనే కత్తిరించుకోకపోతే సైబర్ నేరం కింద కేసు నమోదు చేస్తామని' ఆ ఫోన్ సారాంశం. భయపడిన మణికుమార్ జుట్టు కత్తిరించుకుని ఫొటో వాట్సాప్ చేశాడు. తర్వాత శిరోముండనం చేయించుకోవాలని మరో సందేశం వచ్చింది. భయపడిన మణికుమార్... అలాగే చేసి ఫొటో వాట్సాప్ చేశాడు. భవానీ మాలలో ఉన్న అతని సోదరుడు మాత్రం జుట్టు కత్తిరించుకోలేదు.
ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన మణికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ వాసన్ గ్రామానికి చెందిన మచికూరి పండరి అనే 25 ఏళ్ల యువకుడు వారికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు తీన్మార్ నృత్యాలు చేసే వారిలో జుట్టు ఎక్కువగా ఉన్నవారిని శిరోముండనం చేయించుకోమని పోలీస్ అధికారుల పేరుతో బెదిరించినట్టు గుర్తించారు. గతంలోనూ బ్యాంకు అధికారుల పేరుతో పలువురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. అయితే అతను కావాలనే చేస్తున్నాడా లేక మతిస్థిమితం సరిగ్గా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..
విశాఖలో ఆ తరువాత రిజిస్ట్రేషన్లు అన్నీ వైకాపా నేతలవే: కొల్లు