విశాఖలో పలువురు మహిళలను వేధిస్తున్న అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహిళా చేతన సంస్థ డిమాండ్ చేసింది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించారు. నిత్య పెళ్లికొడుకైన అరుణ్... ఎనిమిది మందితో ప్రేమ వివాహాలు చేసుకుని ఆపై వ్యభిచారం చేయ్యాలంటూ ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితులు తెలిపారు. గంజాయి,వ్యభిచార ముఠాతో అరుణ్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. తన మాట వినకపోతే తుపాకీ, కత్తులతో బెదిరించేవాడని ఆరోపించారు.
అతని ఆగడాలను భరించలేక గత నెల కంచరపాలెం పోలీసులను ఆశ్రయించినట్లు బాధితులు పేర్కొన్నారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు వాయిస్ మెసేజ్ పెట్టినా.. పట్టించుకోలేదని ఆవేదన చెందారు. దిక్కుతోచని స్థితిలో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు బాధిత మహిళలు తెలిపారు. అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేయటంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం వహించటంపై డీజీపి గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు చేపట్టాలని విశాఖ సీపీని ఆదేశించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై సైతం దర్యాప్తు చేపట్టాలన్నారు.
అరుణ్‌పై కేసు నమోదు..
నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును స్వయంగా విశాఖ డీసీపీ రస్తొగీ చూసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. ఇంకెవరైనా బాధితులుంటే నేరుగా డీసీపీని సంప్రదించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదిలేదని డీజీపీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: