మార్వాడీలు దాండియా నృత్యాలతో చిత్తూరు జిల్లా కుప్పంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మరింతకొత్తదనాన్ని సంతరించుకున్నాయి. శాంతిపురంలో కొలువైవున్న దుర్గమ్మ తల్లికి 9 రోజులుగా విశేష పూజలు నిర్వహించిన మార్వాడీలు.... సంప్రదాయ పద్ధతిలో దాండియా నృత్యాలు చేశారు. చిన్నారులు, యువతీయువకులు, మహిళలు భక్తి పాటలతో ఆడిన కోలాటం చూపరులను అలరించింది.
కడపలో
కడప జిల్లా రైల్వే కోడూరులో ఆర్య వైశ్యులు నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఉపవాసం ఆచరించిన పలువురు భక్తులు... అమ్మవారిని స్మరిస్తూ అగ్నిగుండాన్ని దాటారు. వేడుకను తిలకించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ప్రకాశంలో
ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో హారతుల సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు వాసవీ సహస్రనామ కుంకుమార్చన చేశారు.
కర్నూలు, విశాఖలలో
కర్నూలులో మామిడి, అరిటాకులు, వివిధ రకాల పుష్పాలు, గుమ్మడి కాయలు లాంటి పండగ సామాగ్రి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పండగ గిరాకీతో ధరలు ఆకాశాన్నంటాయి. విశాఖలోని అక్కయ్యపాలెం, నర్సింహానగర్ రైతుబజార్, కంచరపాలెం మెట్టు, అల్లిపురం గాంధీ మార్కెట్, మద్దిలపాలెం ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
ఇదీ చదవండి :