CWC Chairman Kushvinder Vohra on Water Issues: రానున్న రెండు దశాబ్దాలలో ప్రపంచం ఎదుర్కొనే అతి పెద్ద సవాలు వాతావరణ మార్పు అని, 80 శాతం వర్షపాతం కేవలం నాలుగు నెలల్లోనే రావడమనే ప్రస్తుత సవాలు రానున్న కాలంలో మరింత తీవ్రంగా ఉంటుందని కేంద్ర జల సంఘం ఛైర్మన్ కుష్విందర్ వోహ్రా (Kushvinder Vohra) అన్నారు.
దీనిపై జర్మనీ యూఎస్ మోడళ్లు ఈ సదస్సులో సమర్పించారని, వీటిపై అధ్యయనం చేయాలన్నారు. విశాఖలో మూడు రోజుల పాటు జరిగిన ఇరిగేషన్, డ్రైనేజ్ 25వ అంతర్జాతీయ సదస్సు (International Commission on Irrigation and Drainage) సందర్భంగా అయన మీడియాతో మాట్లాడారు.
జలవనరుల పరిరక్షణపై విశాఖలో అంతర్జాతీయ సదస్సు - పాల్గొన్న కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్
జల వనరుల రంగం ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించామని, వాటిని విశ్లేషించి, కారణాలు, నీటి యాజమాన్యం ఇందులో మహిళల భాగస్వామ్యంపై వివిధ రకాల మోడల్స్‌ను కూడా అధ్యయనం చేసినట్టు వివరించారు. భారతదేశం ఒక విలక్షణమైన రుతుపవన కాలం ఉన్న ప్రాంతమన్న ఆయన, దేశంలో రిజర్వాయర్లు 71 శాతం నిండి ఉన్నాయన్నారు. రానున్న కాలంలో వర్షం వల్ల వచ్చే నీటిని నిల్వ చేసేందుకు అనుసరించే పద్దతులే పురోగతికి కారణమవుతాయని.. నీటి యాజమాన్య నిర్వహణ కోసం ప్రపంచ స్దాయి సాంకేతికతలపై తీర్మానాన్ని ఆమోదించినట్టు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం: డిమాండ్‌కి తగినట్టుగా నీటిని నిల్వ చేయడం అన్నదే ప్రధానమన్న ఆయన, సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదలు వంటివి అత్యధిక వర్షపాతం ఒకేసారి రావడం వంటివి ఉదాహరణలుగా చర్చించినట్టు వివరించారు. నదుల అనుసంధాన ప్రక్రియకు వివిధ రాష్ట్రాలు తమకు ఉన్న అడ్డంకులును అధిగమిస్తూ ముందుకు వస్తున్నాయని.. యూపీ, మధ్యప్రదేశ్‌ల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం జరుగుతోందని ఖుష్విందర్ వోహ్రా పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది: కేంద్ర మంత్రి షెకావత్
సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సాంకేతికత: సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే సాంకేతికత ఇప్పుడు బాగా ఖర్చుతో కూడుకున్నదే అయినా, భవిష్యత్తులో ఈ ఖర్చు తగ్గేందుకు అవకాశం ఉందన్నారు. నీటి వనరుల నుంచి వాడే నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో తిరిగి వినియోగిస్తున్నాం. ఇప్పుడు మరింత మెరుగైన పద్దతులు క్షేత్రస్దాయిలో అభ్యాసం చేయాలని కొరుతున్నట్టు చెప్పారు.
ఈ సదస్సులో తొలిరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొన్నారు. విశాఖపట్టణం జిల్లా రాడిసన్ బ్లూ హోటల్‌లో జరుగుతున్న ఈ సదస్సులో సుమారు 90 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మరోవైపు దీని కొనసాగింపుగా నాలుగు రోజులపాటు ఐసీఐడీ 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (74th International Executive Council) సమావేశం కూడా జరుగుతుంది.