మారుమూల గిరిజన ప్రాంతాలు ఇంకెన్ని రోజులు అభివృద్ధి లేకుండా ఉండిపోవాలి అంటూ.. విశాఖ జిల్లా సిరిలీమెట్, కేందుగుడా, పిట్టగడ్డ, కీముడుపుట్టు గిరిజనులు భారీ ర్యాలీ చేశారు. తమ వారికి పురిటి నొప్పులు వస్తే చావే గతి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మారుమూల ప్రాంతాలకు రహదారులను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తమ కష్టాలు తీర్చాలనీ.. ఉపాధి హామీ పని రోజులు పెంచాలన్నారు. తమ ప్రాంతాాలకు సెల్టవర్లు, రహదారులు వస్తే సమస్యలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మావోయిస్టుల వలనే అభివృద్ధి ఆగిపోతుందనీ.. ఇంకా వారికి భయపడేది లేదని గిరిజనులు స్పష్టం చేశారు.
మావోయిస్టులకు గట్టి దెబ్బ
మావోయిస్టు ఆవిర్భావ దినోత్సం ముందు ప్రజలు భారీ ర్యాలీ చేయటం మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగలింది. సుమారు పది సంవత్సరాల క్రితం .. ఇదే సిరిలీమెట్ గ్రామస్థులు మావోయిస్టులకు ఎదురు తిరిగారు. కత్తులు, బల్లెలతో తిరుగుబాటు చేసి.. తమ గ్రామాల్లోకి మావోయిస్టులు రాకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం కటాఫ్ ఏరియాలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇదేవిధంగా ఆంధ్రా భూభాగంలో ఉన్న మారుమూల గ్రామాలకు రహదారులు, సెల్ టవర్లు నిర్మించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'భూమి లేని గిరిజనులకు రెండు ఎకరాల చొప్పున ఇస్తాం'