Cpi Agitation: అమాయక గీత కార్మికుల భూములు లాక్కొని వారి కుటుంబాలకు అన్యాయం చెయ్యొద్దని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ కార్యకర్తలు విశాఖ నగరం మధురవాడలో ఆందోళన చేపట్టారు. 40 సెంట్లు భూమిని పాత మధురవాడలో నివాసములుంటున్న కొన్ని కుటుంబాలకు చెందిన గీత కార్మికులు 1957లో కొనుగోలు చేసి 20 సెంట్లలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన 20 సెంట్ల కాళీ భూమిని స్థానికంగా ఉంటున్న కొందరు వైసీపీ నాయకులు దొంగ రిజిస్ట్రేషన్ తో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ కార్యకర్తలు బాధితులకు అండగా నిలిచారు. వైసీపీ నాయకులు కబ్జాకు పాల్పడే భూమిలో ఆదివారం బాధితులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులు న్యాయస్థానం లోను, సిట్ లోను ఫిర్యాదు చెయ్యగా న్యాయస్థానం, సిట్ విచారణ చేసి ఈ భూమి రైతులకు చెందినదని తీర్పు ఇచ్చాయని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి పైడిరాజు తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సీఐడీ అధికారులతో బెదిరింపులు చేస్తూ అమాయక గీత కార్మికులను బెదిరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద గీత కార్మికులపై సిఐడి అధికారుల బెదిరింపులు ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గీత కార్మికులకు చెందిన ఈ భూమిలో ఇతరులు ప్రవేశిస్తే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి