‘జనాలకేమైనా పర్లేదు.. మనింట్లో ఉండకూడదంతే ’అన్నట్లుంది కొందరు కొవిడ్ పాజిటివ్ బాధితుల కుటుంబీకుల ఆలోచన. నగరంలో చాలామంది తమ ఇంట్లో రోగి వాడిన వస్తువుల్ని వీధుల్లో పడేస్తున్నారు. వైరస్‌వ్యాప్తికి ఈ రకంగా ఆయా ఇళ్లవారూ కారకులు అవుతున్నారు. విశాఖలో అలాంటి పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రాలు చూస్తేనే అర్థమవుతుంది.
కట్టేసి.. పడేసి..:
తాటిచెట్లపాలెం సమీపంలోని నందగిరినగర్‌లో ఓ చోట కనిపించిన దృశ్యమిది. ఇక్కడ నిత్యం ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. కొందరు పాజిటివ్ వ్యక్తుల తలగడలు, చొక్కాలు, పరుపులు, ఇతర వస్తువుల్ని కట్టలుగా కట్టి ఇలా తెచ్చి పడేశారు. తాటిచెట్లపాలెంలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది.
పరుపులు.. కుప్పలు:
కలెక్టరేట్ సమీపంలోనే ఉన్న అఫీషియల్స్ కాలనీలో పరిస్థితి ఇది. కొవిడ్ రోగులకు సంబంధించిన పరుపులు, తలగడలు తెచ్చి ఇలా రోడ్డుపక్కనే పడేశారు. గత కొన్నాళ్లుగా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయని స్థానికులు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. అయినా వీటిని తొలగించలేదు.
రద్దీ ప్రాంతంలోనే ఇలా:
మహారాణిపేటలోని ఓ ఆసుపత్రుల సముదాయానికి దగ్గర్లోనే కనిస్తున్న పలు వ్యర్థాల్ని ఇక్కడ గమనించొచ్ఛు ఆసుపత్రుల్లోని ఇంజక్షన్ డబ్బాలు, ఇతర వ్యర్థాల్ని ఇలా తెచ్చిపడేశారు. పక్కనే కూరగాయల మార్కెట్టుతో పాటు ఇతర దుకాణాలూ ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితితో చుట్టుపక్కలవారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బంధువులే ఇలా..:
కేజీహెచ్ సమీపంలో పీపీఈ కిట్లను పడేయటం, రోగులు వాడిన చాపలు, ఇతర వస్తువులు పడేయటం తరచుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోనూ ఆ పరిస్థితి గమనించొచ్ఛు ఆసుపత్రిలోకి వెళ్లే రోగుల బంధువులు కూడా పీపీఈ కిట్‌లు వాడుతున్నారు. వారిలోకొందరు ఇలా పడేసి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. సీఎస్‌ఆర్ బ్లాక్ పరిసరాల్లో రోగులకు, వారి బంధువులకు చెందిన తలగడలు, దుస్తులు కూడా కనిపిస్తున్నాయి.
వాడడం.. పడేయడం..:
కొవిడ్ రోగుల ఇంజక్షన్లను తెచ్చే థర్మాకోల్ డబ్బాలు, ఆక్సిజన్ అందించే పరికరాలకు సంబంధించిన విడిభాగాల డబ్బాల్ని ఎలా పడేశారో ఇక్కడ చూడొచ్ఛు ఇది జగదాంబ కూడలి సమీపంలోని 75అడుగుల రోడ్డులో కనిపించింది. ఇవన్నీ కొవిడ్ రోగి ఇంటి నుంచి వచ్చినట్లయితే ప్రమాదకరమే.
వేరుచేసి అప్పగించండి: కొవిడ్ వ్యర్థాలంటే ప్రమాదకరమైనవే. వాటిని ప్రత్యేకంగా ఉంచి బాధ్యతగా ఇంటింటికీ వచ్చి చెత్త సేకరించే జీవీఎంసీ వ్యాన్‌కు ఇవ్వాలి. అపార్ట్‌మెంట్లలోనూ తడి, పొడి చెత్తతో పాటు ప్రమాదకర చెత్తకోసం ఎరుపురంగు బిన్ ఉంచాలి. వీటి నిర్వహణకు ఓ ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం.
-కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, సీఎంవోహెచ్, జీవీఎంసీ
బాధ్యతారహితంగా ఉండొద్దు..
కొవిడ్ నిర్మూలనలో ప్రజలక్కూడా భాగముంది. అలా ఉండకుండా బాధ్యతారాహిత్యంగా కొవిడ్ రోగుల వ్యర్థాల్ని తెచ్చి ఆరుబయట పడేస్తుండటం చాలా ప్రమాదకరం. పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా మనుషులే అని గుర్తించాలి. వారివి కూడా ప్రాణాలే అని తెలుసుకోవాలి. ఇలా వ్యర్థాల్ని పడేసేవారిపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తాం.
- డాక్టర్ జి.సృజన, జీవీఎంసీ కమిషనర్
ఇదీ చదవండి: