CM responds to ETV Bharat article: భూ సమస్య పరిష్కరించాలని 18 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధురాలి వేదనపై ఎట్టకేలకు యంత్రాంగం స్పందించింది. ‘రమణమ్మ వేదనకు రాయైనా కరగాల్సిందే..కానీ’ అనే శీర్షికతో ‘ఈటీవీ భారత్’లో గురువారం ప్రచురితమైన కథనం సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు శివారు రావిపాలెంకు చెందిన రావి రమణమ్మ(61) కుటుంబానికి అత్తామామల భూమిలో వాటా రాలేదు. ఆ భూమిలో కొంత ప్రభుత్వం సెజ్ కోసం సేకరించగా వచ్చిన పరిహారమూ బంధువులు దక్కకుండా చేశారని బాధితురాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంపై ‘ఈటీవీ భారత్'లో ప్రచురితమైన కథనం సీఎం దృష్టికి వెళ్లింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం కార్యాలయం నుంచి విశాఖ కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆర్డీఓ, అధికారులు గురువారం అచ్యుతాపురం తహసీల్దారు కార్యాలయానికి వచ్చి రమణమ్మను కలిసి వివరాలు సేకరించారు.
- ఇదే కథనంపై ఎలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి శాయికుమారి స్పందించారు. ఈ సమస్యపై సుమోటోగా కేసు నమోదు చేయాలని న్యాయ సేవాసమితి ఛైర్‌పర్సన్‌గా ప్యానల్ న్యాయవాదులను ఆదేశించారు. దీంతో ప్యానల్ న్యాయవాది ఎల్.వి.రామకృష్ణారావు వచ్చి రమణమ్మ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు జడ్జి తెలిపారు. పూర్తి వివరాలతో ఈనెల 19న కోర్టుకు హాజరు కావాలని కలెక్టర్, ఏపీఐఐసీ ప్రత్యేక ఉప కలెక్టర్, అనకాపల్లి ఆర్డీఓ, అచ్యుతాపురం తహసీల్దారుకు నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.
జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాను. అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాననడంతో.. సీఎం అయ్యాక తాడేపల్లికి వెళ్లి విన్నవించుకున్నా. అయినా అధికారులు పట్టించుకోలేదు. 2004 నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. కాగితాలు తీసుకుంటున్నారు... న్యాయం చేస్తానని అంటున్నారు... కానీ చేయడంలేదు. రోజూ ఉదయాన్నే భోజనం తీసుకుని కార్యాలయానికి రావడం... సాయంత్రం వరకు అధికారుల చుట్టూ తిరిగి ఇంటికి వెళ్లటమే దినచర్యగా మారిపోయింది. నా భర్తకు వచ్చే వృద్ధాప్య పింఛనులోంచి రాకపోకలకే రోజు రూ.50 ఖర్చవుతున్నాయని. న్యాయం జరగాలనే రోజు తిరుగుతున్నా. -రమణమ్మ బాధితురాలు
సంబంధిత కథనం: