CM Jagan Visakha Tour: విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. పీఎం పాలెంలోని ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టేడియానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, అభివృద్ధి పనులు, మ్యాచ్‌లతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. జాతీయ మహిళా క్రికెటర్ అంజలి శర్వాణి, అండర్-19 జట్టుకు ఎంపికైన షబ్నంను సత్కరించారు. 10లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి, అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు ఎలాంటి సహకారం కావాలో రోడ్‌మ్యాప్ తయారుచేయాలని.. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డికి సూచించారు. క్రీడాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం అరిలోవ అపోలో ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. క్యాన్సర్ యూనిట్‌ను ప్రారంభించారు. ఆర్కే బీచ్ రోడ్డులో 7 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ‘సీ-హారియర్’ యుద్ధవిమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలో జీవీఎంసీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా, రామ్‌నగర్‌లో వాణిజ్య సముదాయాలకు ప్రారంభోత్సవాలు చేశారు. భీమిలిలో 24.86 కోట్ల రూపాయలతో నిర్మించే ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి సీఎం జగన్ మోహన్మోరెడ్డి హాజరయ్యారు. సాయికార్తీక్, సాహితి దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలులో కాపుభవన శంకుస్థాపన కూడా ఉన్నా.. అది జరగలేదు.
రాజధాని లేని ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ ఈ నెల 3న జన జాగరణ సమితి నిరసన తెలిపింది. గురువారం సీఎం పర్యటన నేపథ్యంలో జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు, నగర కో-కన్వీనర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 18 వేల 500 వేతనం చెల్లించాలంటూ క్లాప్ డ్రైవర్లు వారం నుంచి నిరసన తెలుపుతున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన డ్రైవర్లనూ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పలువురు బాధితులు సమస్యలు చెప్పుకోవాలని యత్నించినా పోలీసులు అడ్డుకోవడంతో బోరున విలపించారు.
వైఎస్సార్ స్టేడియంలో భీమిలి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు 170 మందితో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పదేళ్లుగా కష్టపడుతున్న వారికి పార్టీలో గుర్తింపు లేదంటూ ఈ సందర్భంగా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కాస్త గుర్తింపు తగ్గి ఉండవచ్చు కానీ.. ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో తనకు తెలుసునని జగన్ బదులిచ్చారు. తానూ, పార్టీ ఉన్నామని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. వైపీ సుబ్బారెడ్డి అందుబాటులో ఉంటారని, సమస్యలపై ఆయన్ను కలవాలని సూచించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ రంగప్రవేశం చేస్తున్నారంటూ.... ‘టైగర్ ఎంట్రీ’ పేరిట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే సీఎం సమీక్షలో విజయసాయిరెడ్డి ప్రస్తావనే రాలేదు.
వైఎస్ విగ్రహావిష్కరణకు సీఎం కేటాయించింది 5 నిమిషాలే. అయితే అక్కడికి అయిదు వేల మంది డ్వాక్రా గ్రూపు మహిళలను తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ రావడానికి ముందే అన్నివైపులా గేట్లు మూసేయడంతో.. లోపల ఉన్నవాళ్లు బయటికి వెళ్లలేక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇవీ చదవండి: