మద్యంపై జే ట్యాక్స్
పార్టీ శ్రేణుల సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలున్నాయని ఆయన విమర్శించారు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అమరావతిని పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ నెలకు పూర్తి కావాల్సిన పోలవరం విషయంలోను ఇబ్బందులు సృష్టించారని అన్నారు. గోదావరిలో మునిగిన పడవను బయటకు తీయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మద్యం అమ్మకాల్లో కొత్తరకం దోపిడీ జరుగుతోందన్న చంద్రబాబు... మద్యంపై జగన్ ట్యాక్స్ విధించి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
సెల్ఫోన్ కాంతిలో చంద్రబాబు ప్రసంగం
విశాఖ పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. స్వాగతం పలికేందుకు వస్తున్న కార్యకర్తలను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని... అటువంటి వారు నేరుగా వైకాపాలో చేరితే మంచిదని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయలకు అనుగుణంగా పనిచేస్తాయన్న ఆయన.. పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో పలుసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సెల్ఫోన్ కాంతిలోనే చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. విద్యుత్ కోతలు ప్రభుత్వ పనితీరును తేటతెల్లం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
శుక్రవారం సమీక్షలు
విశాఖలో రెండోరోజు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు జరగనున్నాయి. పెందుర్తి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ దక్షిణ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీకానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సమీక్షల అనంతరం శుక్రవారం సాయంత్రం చంద్రబాబు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
చంద్రబాబు తొలిరోజు పర్యటనలో
చంద్రబాబు తొలిరోజు సమీక్షలలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పాడేరు, అరకు, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాలకు చెందిన తెదేపా శ్రేణులతో చంద్రబాబు ముఖాముఖి జరిపారు. పార్టీలో సమన్వయం, ప్రజా సమస్యలపై బలమైన పోరాట వైఖరి అవలంబించడం వంటి అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గాల పరిధిలో పార్టీకి సంబంధించిన లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు.
ఊహాగానాలకు తెర
అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం వలన పార్టీ క్యాడరుకు, నాయకులకు మధ్య దూరం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని చంద్రబాబు అన్నారు. తిరిగి కార్యకర్తలను పార్టీలో క్రియాశీలకంగా మార్చడంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలనే సూచనలు వచ్చయని ఆయన తెలిపారు. పార్టీని పటిష్ఠం చేసే దిశగా సమన్వయంతో పని చేస్తామని నియోజకవర్గ నాయకులు చంద్రబాబుకు హామీఇచ్చారు. గత కొంత కాలంగా జిల్లాలోని కీలక తెదేపా నాయకులు పార్టీ మారతారనే ఊహాగానాల మధ్య... చంద్రబాబు పర్యటన వీటికీ ఒక సమాధానంగా ఉందని క్యాడర్ అభిప్రాయపడుతోంది. గంటా, పంచకర్ల వంటి నేతలు అధినేత వెంటే ఉన్నారు. పార్టీకి కట్టుబడి ప్రభుత్వ వైఖరిపై పోరాటం చేస్తామని ఇద్దరు నేతలు చంద్రబాబు సమక్షంలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :