పంచాయతీల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలతో పాటు సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తుంటారు. రెండేళ్ల నుంచి పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో ఈ నిధులు విడుదలలో జాప్యం జరిగింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున 14వ ఆర్థిక సంఘం బకాయిలను విడుదల చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, ఇతరత్రా ఖర్చులు పెరగడంతో ఆ నిధులూ ప్రస్తుతం అడుగంటాయి. 2020-21 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం తొలివిడత నిధులుగా రూ.29.69 కోట్లు జూలైలో మంజూరు చేశారు. ఈవిడత పంచాయతీలకు పూర్తిస్థాయిలో కాకుండా 70 శాతం నిధులే ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగతా 30 శాతం నిధులను జడ్పీ, మండల పరిషత్తులకు సర్దుబాటు చేస్తామన్నారు. నెల రోజుల తరువాత టైడ్ గ్రాంట్ రూపంలో మరో రూ.29.69 కోట్లు మంజూరు చేశారు. అయితే ఈ రెండు నిధులు ఇప్పటికీ స్థానిక సంస్థల ఖాతాలకు జమకాకపోవడం గమనార్హం.
సమస్యలతో సతమతం..
పంచాయతీల్లో సరిపడినన్ని నిధులు లేక సమస్యలతో సతమతమవుతున్నాయి. కేవలం పారిశుద్ధ్య పనులు మినహా ఇతర అభివృద్ధి పనులేవీ జరగడం లేదు. జిల్లాలో 40 సమగ్ర రక్షిత నీటి పథకాలున్నాయి. వీటి నిర్వహణకే ఏడాదికి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. వీటికి స్థానిక సంస్థల నిధుల నుంచే వెచ్చించాల్సి ఉంటుంది. నీటి పథకాల నిర్వహణ బకాయిలు పేరుకుపోతుండటంతో గుత్తేదారులు మొండికేస్తున్నారు. ఫలితంగా తాగునీటి సమస్యలు వెక్కిరిస్తున్నాయి. గ్రామాల్లో సీసీ రహదార్ల నిర్మాణానికి పంచాయతీల నుంచి పది శాతం నిధులను సమకూర్చాలి. ఆ నిధులు లేక సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు జరగడం లేదు.
తొలిసారి కొత్త పంచాయతీలకు..
ఇదివరకు 925 పంచాయతీలుండేవి. ఇటీవల పంచాయతీల పునర్విభజన జరగడంతో వాటి సంఖ్య 969కి చేరింది. ఈఏడాది మంజూరైన ఆర్థిక సంఘం నిధులను కొత్త పంచాయతీలకు సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆయా పంచాయతీల జనాభా ఆధారంగా తలసరి రూ.259 చొప్పున నిధులను అందజేయడానికి సిద్ధం చేశారు. ఈ జాబితాలను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. గతంలో జిల్లా మొత్తంగా గ్రాంట్ విడుదల చేయగా ఈసారి కమిషనరేట్ కార్యాలయం నుంచే పంచాయతీ ఖాతాలకు సర్దుబాటు చేయనున్నారని, అందుకే విడుదలలో జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
నిధులు వస్తాయి..
15వ ఆర్థిక సంఘం నిధులను బేసిక్, టైడ్ గ్రాంట్ల రూపంలో రూ.59.39 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చారు. ఇంకా ఆ నిధులు ఖాతాలకు సర్దుబాటుకాలేదు. ఇటీవలే పంచాయతీల వారీగా ఈ నిధులను విభజించి సమాచారం కావాలని కోరారు. త్వరలోనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కొంతమేర ఉన్నాయి. వాటితో పారిశుద్ధ్య పనులకు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం. - కృష్ణకుమారి, జిల్లా పంచాయతీ అధికారిణి
ఇదీ చదవండి :