విశాఖపట్నం జిల్లాలోని 'అరకులోయ' పర్యటకులను అమితంగా ఆకర్షించే ప్రాంతం. అక్కడికి వెళ్లిన ప్రతి పర్యటకుడు కచ్చితంగా రుచి చూడాలనుకునే వంటకం బొంగు చికెన్. దాన్ని టేస్ట్ చేసిన వారెవరైనా ఫిదా అవ్వాల్సిందే! 'ఒన్స్ మోర్' అంటూ మరో ప్లేట్ ఆర్డర్ ఇవ్వాల్సిందే! అంతలా నోరూరించే ఈ వంటకానికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు రాష్ట్ర పర్యటక శాఖ ముందడుగేసింది. విశాఖలోని మరియట్ హోటల్ భాగస్వామ్యంతో భారీ బొంగు చికెన్ వంటకాన్ని చేపట్టింది.
15 అడుగుల 'బొంగు'ల్లో..
హోటల్ యాజమాన్యం విజయవాడలోని బెర్మ్‌పార్క్ వేదికగా భారీ బొంగులను సిద్ధం చేసింది. 15 అడుగుల పొడవు ఉన్న వెదురు బొంగులో వంటకాన్ని చేపట్టారు. ఒక రోజు ముందుగానే కోడి మాంసానికి మసాలా, నిమ్మరసం పట్టించి అరకు వంటకం మాదిరిగానే తయారు చేశారు. మారినేట్ చేసిన కోడి మాంసాన్ని బొంగులో పెట్టి.. పైన వెండితగరి చుట్టి... నిప్పులపై ఉంచారు. నిర్ణీత గడువులో వంటకాన్ని పూర్తి చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. భవిష్యత్తులో ఆసియా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఇంత కంటే భారీగా తయారు చేస్తామని హోటల్ ప్రధాన చెఫ్ తెలిపారు.
గతంలో 'పూతరేకు'.. ఇప్పడు 'బొంగు చికెన్'
గతంలో భారీ పూతరేకుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఏపీ పర్యటక శాఖ ఇప్పుడు బొంగు చికెన్‌తో మరోసారి రికార్డుకెక్కిందని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు. ఏపీ ప్రాంతీయ వంటకమైన బొంగు చికెన్‌ను అన్ని విధాల పరిశీలించే రికార్డు ఇచ్చామన్నారు. పర్యటక శాఖ అధికారులకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ధ్రువపత్రాన్ని చౌహాన్ అందించారు. బొంగు చికెన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన మరియట్ హోటల్ సిబ్బందికి జ్ఞాపికలు అందజేశారు.
పర్యటక ప్రాంతాలతో పాటు ప్రాంతీయ, సంప్రదాయ వంటకాలకు గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో పర్యటక శాఖ చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్న పూతరేకు, ఇప్పుడు బొంగు చికెన్ విశిష్ట గుర్తింపు తెచ్చుకుని ఆంధ్ర రుచుల ఖ్యాతిని పెంచాయి.