ఓ వైపు వేసవి ఠారెత్తిస్తోంది... బయటికెళ్లాలంటేనే భయమేస్తోంది. మరోవైపు సెలవులు ముగింపు ముంచుకొస్తోంది... సమయమంతా వృథా అయిపోతోంది. ఇటువంటి సమయంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది కైలాసగిరి. విశాఖలో సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతం ఆహ్లాదానికి నెలవుగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తే.. నింగి, నేలా కలుసుకున్నాయేమో అనిపిస్తుంది.
సాయంత్రం సరదాగా...
భానుడి భగభగలతో పగలంతా విసిగిపోతున్న విశాఖ ప్రజలు సాయంత్రం అలా సాగర తీరానికో లేదా కైలాసగిరికో వెళ్లి సేదతీరుతున్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. పచ్చని చెట్లు, ప్రకృతి అందాల మధ్య గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడకి వెళితే.. మనసును తేలికపరిచే చల్లని గాలి ఆహ్లాదాన్ని పంచుతుంది. పెద్దలు సాగర తీర ప్రాంత అందాలను ఆస్వాదిస్తుంటే... పిల్లలు అక్కడి ఉద్యానవనాల్లో ఆటలాడుతూ సమయాన్ని సరదాగా గడిపేస్తున్నారు.
సందర్శకులతో కళకళ...
కైలాసగిరి ఆధ్యంతం సందర్శకులతో నిండిపోతోంది. ఎటు చూసినా పర్యాటకులు, నగర వాసులతో ఈ ప్రకృతి అద్భుతం కళకళలాడుతోంది. ఇక్కడి అతిపెద్ద శివపార్వతుల విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పిల్లల వినోదానికి ఇక్కడ లోటే లేదు. టాయ్ ట్రైన్‌లో కొండ చుట్టూ తిరుగుతూ... వైజాగ్‌ను చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవు.
భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందాలంటే... పిల్లలకు ఆహ్లాదం దొరకాలంటే... పెద్దలకు దైవచింతన కలగాలంటే... కైలాసగిరిని సందర్శించాల్సిందే! మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి వెళ్లొచ్చేయండీ...
ఇదీ చదవండీ: తొమ్మిదేళ్ల కల ఫలించిన వేళ.. "జగన్ ప్రస్థానం"