అంతర్వేది ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మంత్రి అవంతి తప్పుబట్టారు. పోలీసు పై నమ్మకం లేదని వ్యాఖ్యానించిన పవన్ సిగ్గుతో తల వంచుకోవాలని విమర్శించారు. అంతర్వేది అంశంలో భాజపా,హిందూ సంస్థలు ఎవరూ ఆందోళన చెందవద్దని.. తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రతి రోజు ఏదో పేరుతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్లో కూర్చొని కుట్రలు పన్నుతున్నారన్నారు. అంతర్వేది ఘటన బాధాకరమని... ఈ ప్రభుత్వానికి అన్ని మతాల పట్ల విశ్వాసం ఉందని అవంతి స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ఉండాలని చంద్రబాబు అంటారని.. కానీ అక్కడ పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని చెబుతారని ఆరోపించారు. అమరావతిని ఎలా పెట్టారో.. అదే హక్కుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. మంత్రి తేల్చిచెప్పారు.
రాబోయే రోజుల్లో వీఎంఆర్డీఏకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు ముత్తంశెట్టి పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ లో వీఎంఆర్డీఏకు మూడు, నాలుగు దశాబ్దాల నుంచి మంచి పేరు ఉందన్నారు. మూడు జిల్లాల్లో మంచి లే అవుట్లు వేసి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖలలో పెండింగ్ లో ఉన్న ఎన్ఏడీపై వంతెన, వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రేవు పోలవరం, యారాడ, తంతడి, పూడిమడక, తదితర బీచ్ ల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి పీపీపీ మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
ఆర్కియాలజీకి సంబంధించి తొట్లకొండ, బావికొండ, పావురాలకొండలకు బుద్ధిస్టులు వచ్చి ధ్యానం చేసుకునే విధంగా... మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదాయం పెంచే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రపంచపటంలో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు ముత్తంశెట్టి తెలిపారు. రాష్ట్రంలోని 12 స్థలాల్లో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: