Vishaka Rama Naidu studio lands issue: తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ ఆనాడు తెలుగుదేశం హయాంలో విశాఖపట్నం జిల్లాలో ఇచ్చిన భూమిలో లేఔవుట్లకు ప్రభుత్వ అధికారులు అనుమతులివ్వడం వివాదాస్పదంగా మారింది. జీవీఎంసీకి దరఖాస్తు చేయడానికి ముందే.. దస్త్రాలు కదలడానికి అవాంతరాల్లేకుండా తెరవెనుక పావులు కదలటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, అధికారులు ఆగమేఘాలపై లేఔవుట్లకు ఆమోద ముద్ర వేసి, అనుమతులను మంజూరు చేయటం విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నేతలే చక్రం తిప్పారని, అందుకే మాజీ కమిషనర్ అత్యుత్సాహం చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
15.18 ఎకరాల్లో లేఔవుట్‌కు అనుమతులు.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ విశాఖ సాగరతీరంలోని కొండపై రామానాయుడు స్టూడియోకిచ్చిన భూమిని వాణిజ్య పరంగా మార్చే ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ స్టూడియోకిచ్చిన భూములపై గతంలోనే అభ్యంతరాలున్నాయి. ఏళ్లు గడుస్తున్నా అనుకున్న ఉద్దేశం నెరవేకపోగా 15.18 ఎకరాల్లో.. లేఔవుట్‌కు అనుమతులు పొందడం చర్చనీయాంశమైంది. అనుమతులకు దరఖాస్తుకు ముందే ఎలాంటి అవాంతరాల్లేకుండా తెరవెనుక చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
34.44 ఎకరాలు సినీ పరిశ్రమకు కేటాయింపు.. తెలుగుదేశం ప్రభుత్వం 2003వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీన విశాఖ-భీమిలి బీచ్ రోడ్డులో 34.44 ఎకరాలు రామానాయుడు స్టూడియోకు కేటాయించింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం.. ఎకరాకు రూ.5 లక్షల 20వేల రూపాయలు. ఆ ప్రకారం డబ్బులను చెల్లించి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సేల్ డీడ్ చేసుకుంది. దాదాపు 13 ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఆ భూమిలో కొంతమేర లేఔవుట్‌కు అనుమతులు పొందడం.. వివాదాస్పదంగా మారింది.
4 ఎకరాలు నిషిద్ధ ప్రాంతం.. వాస్తవానికి బావికొండ బౌద్ధారామ ప్రదేశం. ఇది నిషేధిత ప్రాంతంలో ఉంది. స్టూడియోకు చెందిన 10 ఎకరాల వరకు ఆ పరిధిలో ఉన్నాయి. 1981 ఉత్తర్వుల ప్రకారం.. పురావస్తు ప్రదేశాలకు వర్తించే నిబంధనలు, చట్టాలు ఈ ప్రాంతంలో అమలవుతున్నప్పటికీ జీవీఎంసీ అనుమతులిచ్చింది. ఇదే భూముల్లో 4 ఎకరాలు సీఆర్‌జడ్ నిషిద్ధ ప్రాంతంలో ఉండగా.. కొన్ని రోజుల క్రితమే వీఎమ్‌ఆర్‌డీఎ మాస్టర్ ప్లాన్‌లో మిక్స్‌డ్ జోన్‌గా మార్చడంతో.. దాదాపు 15.18 ఎకరాల్లో లేఔవుట్ వేయడానికి మార్గం సుగమమైంది.
మూడు రోజుల్లో అనుమతులు.. లేఔవుట్ అనుమతులకు దరఖాస్తు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే ఆమోద ముద్ర పడింది. ఏప్రిల్ 3న దరఖాస్తు చేయగా, మూడు రోజులపాటు ఎల్టీపీ లాగిన్‌లో ఉంది. అక్కడ్నుంచి జీవీఎంసీ TPAకు చేరి.. అక్కడ 2 గంటలు, ఏసీపీ వద్ద 27 నిమిషాలు ఉంది. అక్కడ్నుంచి సీసీపీ లాగిన్‌కు చేరిన 57 నిమిషాల తర్వాత నాటి కమిషనర్ రాజాబాబు లాగిన్‌లోకి వెళ్లింది. దీంతో ఆయన 45 నిమిషాల వ్యవధిలోనే ఆమోదం తెలిపారు.
భూమిపై అధికార పార్టీ నేతల కన్ను.. అనుమతులు పొందినందుకు జీవీఎంసీకి 15% చొప్పున రూ. 7వేల 283 చదరపు మీటర్లు ఈ నెల 10న మార్టిగేజ్ చేశారు. ఆకస్మాత్తుగా స్టూడియో భూముల్లో లేఅవుట్‌కు దరఖాస్తు చేయడం, తక్కువ సమయంలోనే కమిషనర్ బదిలీకి ముందు దానికి ఆమోదం దక్కడంపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలాలపై ఇప్పటికే కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడిందని సమాచారం. మొదట లేఅవుట్ అనుమతులు పొంది, తర్వాత వాటిని సొంతం చేసుకునేందుకు అడుగులు పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
చివరగా బావికొండ బౌద్ధ ప్రదేశంలోని నిషేధిత ప్రాంతంలో లే-అవుట్‌కు అనుమతులివ్వడంపై న్యాయ విచారణ జరిపించాలని విశ్రాంత IAS అధికారి EAS శర్మ.. ప్రభుత్వప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాశారు.
ఇవీ చదవండి