ఒడిశా-పశ్చిమ బంగా తీరాలకు దగ్గరగా ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు 160 కిలోమీటర్లు, పశ్చిమ బంగాల్లోని దిఘాకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ రాష్ట్రాల్లో 20 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా తీర ప్రాంతాల్లో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవీ చదవండి