Demand to increase support price for cotton: పత్తికి మద్దతు ధర కింటా రూ.12 వేలకు పెంచాలని తెదేపా ఆందోళన చేపట్టింది. పత్తి ధరను కింటాకు రూ.12 వేలకు పెంచి రైతుల వద్ద ఉన్న పత్తి నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర తెలుగు రైతు ఆధ్వర్యంలో నాయకులు శనివారం వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో పర్యటించారు. రైతుల వద్ద నిలువ ఉన్న పత్తిని పరిశీలించి రైతులతో మాట్లాడారు.
అకాల వర్షాలతో తగ్గిన పత్తి దిగుబడి: ఈ ఏడాది అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడులు తగ్గిపోయాయని, ఇదే సమయంలో పత్తి ధర దారుణంగా పడిపోయిందని అన్నారు. దీని వల్ల రైతులు తక్కువ ధరకు పత్తిని విక్రయించుకోలేక ఇళ్లలోనే నిలువ చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మద్దతు ధరను కింటాకు 12 వేలకు పెంచి రైతుల నుంచి మార్క్ పెడ్ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో రాష్ట్ర తెలుగు రైతు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
రైతుల సంక్షేమ నిధి ఏదీ..?: రైతులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దానిద్వారా రైతుల పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. గత ఏడాది మిర్చి పంట నష్టపోయిన రైతులకు జగ్గయ్యపేట నియోజకవర్గంలో కోటిన్నర వరకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మళ్లీ మిర్చి పంట దెబ్బతినకుండా సూచనలు, సలహాలు, కార్యాచరణ చేపట్టడానికి ఇప్పటివరకు శాస్త్రవేత్తలు, అధికారులు, పాలకులు రైతుల వైపు తొంగి చూడలేదని ఆక్షేపించారు.
ఇవీ చదవండి